Indian Railways: స్లీపర్ కోచ్ లను తగ్గిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న నిర్ణయంపై బిగ్ టీవీ ప్రచురించిన కథనానికి దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని దిద్దుబాటు చర్యలకు దిగింది. స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాస్త ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి వెళ్లే మూడు ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా స్లీపర్ కోచ్ లను యాడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ కీలక ప్రకటన విడుదల చేశారు.
స్లీపర్ కోచ్ లు పెంచిన రైళ్లు ఇవే!
⦿ హైదరాబాద్-ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్-హైదరాబాద్ మధ్య రాకపోపలు కొనసాగించే ముంబై ఎక్స్ ప్రెస్ లో(22731/22732 సెప్టెంబరు 23, 26 తేదీల నుంచి 2 స్లీపర్ కోచ్ లు జత చేయనున్నారు.
⦿ అటు ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై- హైదరాబాద్, హైదరాబాద్-ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై మధ్య నడిచే హుస్సేన్‌సాగర్ ఎక్స్ ప్రెస్ (12701/12702)లో సెప్టెంబరు 24, 25 తేదీల నుంచి 2 స్లీపర్ బోగీలు పెరగనున్నాయి.
⦿ ఇక సికింద్రాబాద్- భువనేశ్వర్, భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్ ప్రెస్ (17016/17015)లో సెప్టెంబరు 23, 25 తేదీల నుంచి 3 చొప్పున స్లీపర్ బోగీలు పెరగనున్నాయి.
Read Also: రైల్వే స్టేషన్లలో AI టెక్నాలజీ, ఇక చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది!
జులై 21న సామాన్యుల ఇబ్బందులపై బిగ్ టీవీ కథనం..
హైదరాబాద్ నుంచి సుదూర ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించే రైళ్లలో స్లీపర్ కోచ్ ల సంఖ్య తగ్గించాలని అధికారులు నిర్ణయించడంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం రాసింది. హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ ప్రెస్, ముంబైకి వెళ్లే హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్, కోస్తా ఆంధ్రకు వెళ్లే గోదావరి, గౌతమి ఎక్స్ ప్రెస్‌లు, చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్, హైదరాబాద్ దక్కన్ – ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సర్వీస్ లో స్లీపర్ కోచ్ లు తగ్గించడంతో ప్రయాణీకులకు ఇబ్బందులు ఏర్పడుతున్నారని వెల్లడించింది. స్లీపర్ కోచ్ ల స్థానంలో రైల్వే అధికారులు ఏసీ కోచ్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏసీ ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగానే అదనపు కోచ్ లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, కొద్ది రోజుల్లోనే సామాన్య ప్రయాణీకుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో.. రైల్వే అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. కొన్ని రైళ్లకు స్లీపర్ కోచ్ లను పెంచుతున్నట్లు తెలిపారు.
స్లీపర్ కోచ్ ల తగ్గింపు గురించి బిగ్ టీవీ రాసిన కథనం ఇదే.. స్లీపర్ కోచ్‌లు సగానికి తగ్గింపు, సామాన్యలపై తీవ్ర ప్రభావం!