Maruti Suzuki Upcoming Cars: దేశీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి తన పట్టును మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. రాబోయే 2026–2027లో కొత్త కార్లతో పాటు ఇప్పటికే విక్రయిస్తున్న మోడళ్లకు అప్‌డేట్స్ తీసుకురానుంది. ఎలక్ట్రిక్ MPV, చిన్న SUV, మూడు వరుసల SUV వంటి విభిన్న విభాగాల్లో ఐదు కొత్త మోడళ్లను పరిచయం చేయాలని చూస్తోంది. వీటిలో ఏ కారు ఎప్పుడు వస్తుంది? ధర ఎంత ఉండొచ్చు? ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారును రోడ్లపై పరీక్షిస్తున్నారు. ఇందులో లెవెల్-2 ADAS టెక్నాలజీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ LED లైట్లు, అల్లాయ్ వీల్స్ తో పాటు పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు ఉండవచ్చని అంచనా. 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా రావచ్చు. అంచనా ధర రూ.7 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ఉండొచ్చు.
YMC కోడ్‌నేమ్‌తో మారుతి కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ MPVని అభివృద్ధి చేస్తోంది. ఇ-విటారా ప్లాట్‌ఫామ్‌పై రూపొందుతున్న ఈ కారు 2027 మార్చి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని అంచనా. దీని ధర రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండొచ్చు.
మారుతి నుంచి రానున్న మరో ఆసక్తికర మోడల్ Y43 మైక్రో SUV. ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్‌లకు పోటీగా నిలవనుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు మాన్యువల్, AMT గేర్‌బాక్స్ లు ఉండవచ్చు. CNG వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, 9 ఇంచుల టచ్ స్క్రీన్ లాంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా. 2027లో విడుదలయ్యే ఈ కారు ధర రూ.5.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండవచ్చు.
గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్ కూడా 2027 ప్రారంభంలో రావచ్చు. కొత్త LED లైటింగ్, మారిన బంపర్లు, 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి మార్పులు ఉండవచ్చని సమాచారం. లెవెల్-2 ADAS, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు కూడా జత కావచ్చు. పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG ఆప్షన్లు కొనసాగుతాయని అంచనా. ధర రూ.11 లక్షల నుంచి రూ.20.50 లక్షల వరకు ఉండొచ్చు.
మూడు వరుసలతో రానున్న Y17 SUV మారుతి కొత్త లాంచ్‌లలో కీలకంగా నిలవనుంది. ఇందులో 6, 7 సీట్ల ఆప్షన్లు ఉండవచ్చు. రెండో వరుసలో కెప్టెన్ సీట్లతో కూడిన 6-సీటర్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG పవర్‌ట్రెయిన్‌లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ADAS లాంటి ఫీచర్లు ఉండవచ్చు. 2027లో విడుదలయ్యే ఈ SUV ధర రూ.14 లక్షల నుంచి రూ.23 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
Read Also: బాబోయ్ 70% బై బ్యాక్ ఆఫర్.. కియా సోరెంటో లవర్స్ గుడ్ న్యూస్!