Election Polling : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ సమయం వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. మనుగోడులో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో అనారోగ్య కారణాలతో కదలలేని స్థితిలో ఉన్న 739 మంది వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 696 మంది ఇంటి నుంచే ఓటు వేసే హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 43 మంది అందుబాటులో లేరు. వీరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయాలనుకున్నా అవకాశం లేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 119 కేంద్రాల్లోని 298 బూత్ ల్లో పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 6న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అన్ని బూత్‌లలో వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నారు. 2 వేల మంది పోలీసులతోపాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్ లాంటి 6 కంపెనీల బలగాలను మోహరించారు. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు విధుల్లో ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు.