Nasas Insight Mars Lander : మార్స్ గ్రహం( అంగారక గ్రహం లేదా అరుణ గ్రహం)పై అధ్యయనానికి నాలుగేళ్ల క్రితం నాసా పంపించిన ‘ఇన్ సైట్’ ల్యాండర్ కు ఇక గుడ్ బై చెప్పేసే సమయం వచ్చేసింది. దానికి వీడ్కోలు పలకడానికి డెత్ సర్టిఫికెట్ ను కూడా నాసా రెడీ చేస్తోంది. మీకు గుర్తుందా… ఈ ఏడాది ఏప్రిల్ 24న ‘ఇన్ సైట్’ సెల్ఫీ తీసుకుని నాసాకు పంపించింది. అలాంటి రోవర్ కు కాలం చెల్లడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ రోవర్ సొంతంగా సోలార్ విద్యుత్తును తయారు చేసుకునే శక్తిని కోల్పోయింది. ఎందుకంటే దానికి అమర్చిన సోలార్ ప్యానల్ పై ధూళి తుఫాను కారణంగా దుమ్ము విపరీతంగా పేరుకుపోయింది. ఆ దుమ్ము తొలగిపోతేగానీ రోవర్ మళ్లీ సొంతంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసుకోలేదు.
ఇప్పుడా రోవర్ తన సామర్థ్యంలో 20 శాతం కంటె తక్కువ స్థాయిలోనే కరెంటును ఉత్పత్తి చేసుకుంటోంది. ఈ పవర్ రోవర్ లోని సాంకేతిక పరికరాలు పనిచేయడానికి సరిపోదు. ఇది గమనించిన నాసా సైంటిస్టులు… పరిస్థితి చక్కబడుతుందేమో అనే ఆశతో రోవర్ లోని డాటా కలెక్షన్ కోసం అమర్చిన పరికరాలు పనిచేయకుండా నిలిపేశారు. కేవలం సిస్మోమీటర్ మాత్రమే పనిచేసేలా జాగ్రత్త పడ్డారు. అయితే ఉన్న విద్యుత్తుతో రోవర్ ను మరికొన్ని రోజులు పనిచేయించి అందులో స్టోర్ అయిన విలువైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘ఇన్ సైట్’ రోవర్ ఇప్పటికే మార్స్ ఉపరితలంపై ఉన్న పొరలు, శిలాజాలు, అయస్కాంత శక్తి, మార్స్ పై ఉన్న వాతావరణం, అరుణ గ్రహంపై సంభవించే ప్రకంపనలకు సంబంధించిన సమాచారాన్ని రికార్డు చేసింది. ఈ డాటాను సురక్షితంగా పొందేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా పూర్తయితే ఆ రోవర్ కు నాసా గుడ్ బై చెప్పనుంది.