Nagoba Jatara: తెలంగాణ నాగోబా జాతర అంటే దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతరలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడతాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గల ఆచారాలు.. పూర్వీకుల సంస్కృతిని మనకు గుర్తు చేస్తాయి. అలాంటి ఓ ఆచారాన్ని నేటికీ ఇక్కడి గిరిజనులు పాటిస్తున్నారు. అదే భేటింగ్. భేటింగ్ అంటే ఏమిటి? అసలు ఈ ఆచారం ఏమిటి? ఏం చేస్తారో తెలుసుకుందాం.
గోండుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో అంబరాన్నంటే ఆదివాసీ సంబురం ఇది. దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా నిలవడం తెలంగాణకు గర్వకారణమని చెప్పవచ్చు. అందుకే ఈ జాతరను తిలకించేందుకు ఎందరో భక్తులు తరలివస్తారు.ప్రధానంగా మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడం విశేషం.
కేస్లాపూర్ లో వెలసిన గిరిజనుల ఇలవేల్పుగా పిలువబడే నాగోబా ఆలయంలో ప్రతి ఏటా ఈ జాతర జరుగుతుంది. పుష్య అమావాస్య నాడు ప్రారంభమైన నాగోబా జాతర 10 రోజులు సాగుతుంది. ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఘట్టంను అత్యంత భక్తిశ్రద్దలతో మెస్త్రం వంశీయులు నిర్వహిస్తారు.
ఈ జాతరలో తరతరాల నుండి వస్తున్న ఎన్నో ఆచారాలను నేటికీ కొనసాగించడం విశేషం. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది భేటింగ్ కార్యక్రమం. అసలు భేటింగ్ అంటే ఏమిటంటే.. తమ ఇంటికి వచ్చిన కొత్త కోడళ్లను తమ ఇష్ట దైవాలకు పరిచయం చేయడం. ఈ పరిచయ కార్యక్రమం నిర్వహించకుండ, కొత్త కోడళ్లకు ఆలయ ప్రవేశం నిషిద్దం. అంతేకాదు దైవ దర్శనం కూడ నిషిద్దమే. ముందుగా కొత్త కోడళ్లు ఉపవాసం ఆచరించడం ఆనవాయితీ.
ఆ తర్వాత కొత్త కోడళ్లను భేటింగ్ కార్యక్రమం ద్వార జాతరలో తమ ఇలవేల్పులకు పెద్దలు పరిచయం చేస్తారు. అది కూడా అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. తెల్లని వస్త్రాలను ధరించి కొత్త కోడళ్ళు నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పరిచయ కార్యక్రమం సాగుతుంది.
Also Read: Delhi Railway Station: గిన్నిస్ రికార్డుల్లోకి ఢిల్లీ రైల్వే స్టేషన్, కారణం ఏంటో తెలుసా?
అనంతరం కోడళ్లు ఆలయం ప్రాంగంలోని గోవడ్ వద్ద కొత్త కుండల్లో నైవేద్యం చేసి దేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ భేటింగ్ పరిచయ కార్యక్రమం పూర్తికాగానే కొత్త కోడళ్లను దైవదర్శనాలకు అనుమతిస్తారు. ఈసారి జాతరలో 80 మంది కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం సాగింది. ఇలా నాగోబా జాతరలో ఎన్నో విశేష ఘట్టాలు ఉన్నాయి. అందుకే దేశంలోనే రెండో అతిపెద్ద జాతరగా నాగోబా జాతర పిలువబడుతుంది. నేటికీ నాటి సంస్కృతి సాంప్రదాయాలను సాగిస్తున్న మెస్త్రం వంశీయుల భక్తికి ప్రతీకగా నాగోబా జాతర నిలుస్తుంది.