New Delhi Railway Station Guinness Record: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ గా గుర్తింపు తెచ్చుకుంది. దేశ వ్యాప్తంగా లక్ష కిలో మీటర్లకు పైగా రైల్వే లైన్లు ఉన్నాయి. 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ సుమారు 20 వేల రైళ్లు తమ సేవలను అందిస్తున్నాయి. 2.5 కోట్ల మందికి పైగా ప్రయాణీకులు తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ఈ సంఖ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాస్మానియా మొత్తం జనాభా కంటే ఎక్కువ కావడం విశేషం.
ఢిల్లీ రైల్వే స్టేషన్ కు గిన్నిస్ రికార్డు
ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ ఎన్నో ఘనతలను సాధించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థను కలిగి ఉన్న రైల్వే స్టేషన్ గా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ను గుర్తించినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధులు వెల్లడించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మొత్తం 1,122 వరకు సిగ్నల్డ్ కదలికలను అనుమతించే 11,000 రిలేలను ఉపయోగిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచంలో మరే రైల్వే స్టేషన్ లోనూ లేకపోవడం విశేషం.
రైళ్ల రాకపోకలకు అనుకూలంగా ట్రాక్ లను మార్చే వ్యవస్థ
ఇక ఇంటర్ లాకింగ్ లు పలు రకాలుగా ఉంటాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్/కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఇంటర్ లాకింగ్స్ ఉంటాయి. ప్యానెల్ ఇంటర్ లాకింగ్ అనేది దేశ వ్యాప్తంగా చాలా స్టేషన్లలోఉపయోగిస్తారు. ఇది పాయింట్లు, సిగ్నల్స్ వాటిని నియంత్రించే స్విచ్‌ల ద్వారా పని చేస్తాయి. రూట్ రిలే ఇంటర్ లాకింగ్ అనేది పెద్ద, రద్దీగా ఉండే స్టేషన్లలో మాత్రమే ఉపయోగిస్తారు. ఇవి అధిక సంఖ్యలో ట్రాక్ కదలికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంటర్ లాక్ వ్యవస్థ కారణంగా రైల్వే ప్రయాణాలు మరింత సులభంగా కొనసాగుతాయి.మానవ తప్పిదాలు, నిర్లక్ష్యాన్ని తగ్గించడంతో పాటు భద్రతా నిబంధనలలకు అనుగుణంగా ఉంటాయి.
రద్దీ రైల్వే స్టేషన్లలో రూట్ రిలే ఇంటర్ లాక్ సిస్టమ్
రూట్ రిలే ఇంటర్ లాక్ అనేది పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకలు కలిగి ఉండే అతిపెద్ద, ఎక్కువ రద్దీ ఉండే రైల్వేస్టేషన్లలో ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థలో స్టేషన్ లోని అన్ని ట్రాక్ లను అవసరానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. రైళ్లను రిసీవ్ చేసుకోవడానికి, పంపడానికి రెండు బటన్లను నొక్కడం ద్వారా రూట్ వెంట ఉన్న అన్ని అనుబంధ పాయింట్లు, సిగ్నల్స ను ఒకేసారి సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంటర్ లాక్స్ మధ్య ఇంటర్ కనెక్షన్ రకాన్ని బట్టి ఇంటర్ లాక్‌లు, ఇంటర్ లాక్ వ్యవస్థలను మూడు ప్రధాన గ్రూపులుగా విభజించారు రైల్వే అధికారులు. వాటిలో ఒకటి మెకానికల్ ఇంటరాల్ వ్యవస్థ, మరొకటి ఎలక్ట్రికల్ ఇంటర్ లాక్ వ్యవస్థ కాగా, ఇంకోటి కీ ఇంటర్ లాక్ వ్యవస్థ. ఆయా రైల్వే స్టేషన్ల రద్దీ, రైళ్ల రాకపోకలను బట్టి ఆయా ఇంటర్ లాక్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు రైల్వే అధికారులు.
Read Also: మీరు కళాకారులా? రైల్వే ప్రయాణంలో 75 శాతం రాయితీ పొందచ్చు, ఎలాగో తెలుసా?