BC Reservations: బీసీ సంఘాల తెలంగాణ బంద్ నేపథ్యంలో 42% రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుపడుతున్నది బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలే అని క్షేత్ర స్థాయిలో పెద్దఎత్తున ప్రచారం జరగుతున్నది. ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి వల్లే బిల్లులు ఆమోదం పొందడం లేదనే చర్చ జోరందుకుంది. బీసీల బంద్‌కు మద్దతు ఇస్తున్న ఈ పార్టీలు రిజర్వేషన్లకు అనుకూలంగా న్యాయస్థానాల్లో ఎందుకు తమ వాదనను వినిపించడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
⦿ ఇది బీఆర్ఎస్- బీజేపీ హైడ్రామా..!
జీవో నంబర్ 9కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలైనప్పుడు బీజేపీ, బీఆర్ఎస్‌లు ఎక్కడున్నాయని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పిటిషన్లలో ఇంప్లీడ్ అయ్యి రిజర్వేషన్లను సమర్థిస్తూ ఎందుకు తమ వాదనను వినిపించలేదని నిలదీస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఈ రెండు పార్టీలు రిజర్వేషన్లను అడ్డుకొనేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు న్యాయపరమైన చిక్కుల్లో పడాలనే ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీలు కోర్టు ప్రక్రియకు దూరంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
⦿ బిల్లు ఆమోదం పొందకుండా కుట్రలు..!
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లులు, చట్టసవరణలు.. రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ బిల్లులకు తక్షణమే ఆమోదం లభించేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీసీ సంఘాల నాయకులు నిలదీస్తున్నారు. బీసీల పట్ల ప్రేమ ఉంటే, కేంద్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా వెంటనే బిల్లులకు ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆమోదం రాకుండా అడ్డుకోవడం ద్వారా, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధత పొందకుండా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
⦿ కాంగ్రెస్‌కు క్రెడిట్ రావొద్దనే.. బీఆర్ఎస్ ఇలా..?
బిల్లులు ఆమోదం పొందకుండా బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కై రాష్ట్రపతి, గవర్నర్‌ఫై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ తెచ్చిన బిల్లులకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చినా కూడా కేంద్రంలోని బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని, ఆమోదం ప్రక్రియను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని మండిపడుతున్నారు.
⦿ బంద్‌కు మద్దతు కేవలం రాజకీయ డ్రామా!
జీవో9పై హైకోర్టు స్టే విధించిన తర్వాత, బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. అయితే, బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, తమ కుట్రలను కప్పిపుచ్చుకునేందుకే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీల నుంచి తమకు ఆశించిన మద్దతు లభించడం లేదని గ్రహించిన బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభను వాయిదా వేసుకుందని పలువురు గుర్తు చేస్తున్నారు. దీంతో బీసీలపై ఆగ్రహంగా ఉన్న బీఆర్ఎస్.. వారికి దక్కాల్సిన రిజర్వేషన్లను అడ్డుకుంటూనే బీసీల ఆందోళన కార్యక్రమాలకు మద్దతు ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీసీల నోటికాడికి వచ్చిన 42 శాతం రిజర్వేషన్లను న్యాయపరంగా అడ్డుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే, బీసీల బంద్‌కు మద్దతు అంటూ ఈ రెండు పార్టీలు సరికొత్త రాజకీయ కుట్రకు తెరలేపాయనే చర్చ జరుగుతోంది.
⦿ బీజేపీ- బీఆర్ఎస్ తీరుపై బీసీలకు అనుమానం..?
కోర్టు కేసుల్లో ఇంప్లీడ్ కావడం, బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం వంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు చేయకుండా, కేవలం బంద్ లాంటి నిరసనలకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలతో బీజేపీ-బీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరు బీసీలలో మరింత అనుమానాన్ని పెంచుతోంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉమ్మడిగా కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్-బీజేపీల ఈ ద్వంద్వ వైఖరి బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇకనైనా రాజకీయ కుట్రలకు ఫుల్‌స్టాప్ పెట్టి బీసీ రిజర్వేషన్లపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. అధికార కాంగ్రెస్‌తో కలిసి 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాడాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: జూబ్లీ కింగ్ ఎవరు..? ఎవరి గెలుపు శాతం ఎంత..? ఇది క్లియర్ కట్ వివరాలు..
ALSO READ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. బీఆర్ఎస్ కు ఓ క్లారిటీ వచ్చేసింది.. గెలుపు వారిదే..?