Hyderabad New Flyover: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టుకు వెళ్లాలంటే ఎదురయ్యే ట్రా ఫికర్ కు త్వరలోనే జీహెచ్ఎంసీ తెర దింపనుంది. తొలుత బంజారాహిల్స్ రోడ్ నెం. 12 నుంచి ఫస్ట్ లాన్సర్, అహ్మద్ నగర్, పోచమ్మబస్తీ మీదుగా సరోజీనీ దేవి కంటి ఆసుపత్రి నుంచి ఏయిర్ పోర్టు వరకున్న పీవీఎన్ ఎక్స్ ప్రెస్ వేకు లింకుగా, రేతీబౌలీ జంక్షన్ నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా జీహెచ్ఎంసీ ఓ ఫ్లై ఓవర్ ను ప్లాన్ చేసింది. కానీ ఈ ఫ్లై ఓవర్ పై ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించగా, ఎక్కువగా రెసిడెన్షియల్ భవనాలకు చెందిన భూమి, మెహిదీపట్నంలోని రక్షణ శాఖకు చెందిన భూముల సేకరణ కష్టతరంగా మారటంతో జీహెచ్ఎంసీ ప్రతిపాదనలను మార్చుకుని, ఇపుడు ప్రత్యామ్నాయంగా జూబ్లీహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ (ఐసీసీసీ) నుంచి నేరుగా నానల్ నగర్ జంక్షన్ లోని పీవీఎన్ ఎక్స్ ప్రెస్ వరకు అనుసంధానంగా మరో ఫ్లై ఓవర్లను నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినట్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ శుక్రవారం వెల్లడించారు.
ఈ ఫ్లై ఓవర్ ను ఐసీసీసీ నుంచి ఫిల్మ్ నగర్, అపోలో ఆస్పత్రి నుంచి మల్కం చెరువు రోడ్డు వరకు, అక్కడి నుంచి టోలీ చౌకీ, నానల్ నగర్ మీదుగా నిర్మించి రేతీబౌలీ జంక్షన్ వద్దనున్న పీవీఎన్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 35 వద్ద ఎక్స్ ప్రెస్ వేకు లింకుగా నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం. రేతీబౌలీ జంక్షన్ వరకు సింగిల్ ఫ్లై ఓవర్ గా నిర్మించి, రేతీబౌలీ జంక్షన్ లోని హస్తం గుర్తు నుంచి మెహిదీపట్నం వైపు ఒక ర్యాంప్ ను, అలాగే పీవీఎన్ ఎక్స్ ప్రెస్ వేకు చేరుకునేందుకు మరో ర్యాంప్ ను నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపాదనలను ఆమోదించుకున్న జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎఫెక్టు అయ్యే ఆస్తులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిసింది.
Also Read: Jio Recharge Plans: జియో షాకింగ్ ఆఫర్.. రూ.579 ప్లాన్‌తో రూ.35,000 విలువైన ప్రీమియం సర్వీస్ ఫ్రీ!
ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఇక ఎలాంటి అడ్డంకుల్లేకుండా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వంటి ప్రాంతాల నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్డుకు తక్కువ సమయంలో చేరుకునే వెసులుబాటు కల్గుతుందని జీహెచ్ఎంసీ భావిస్తుంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్య పరిష్కారం, వాహానాల రాకపోకలు స్పీడప్ చేసేందుకు వీలుగా రూ. 1090 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు అండర్ పాస్ లు, మరో ఏడు స్టీల్ ఫ్లై ఓవర్ల ఏర్పాటు పనులు ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెల్సిందే. వీటికి తోడు ఐసీసీసీ నుంచి రేతీబౌలీలోని పీవీఎన్ ఎక్స్ ప్రెస్ వేకు అనుసంధానంగా ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తీసుకువస్తే జూబ్లీహిల్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాలతో పాటు పంజాగుట్ట, బంజారాహిల్స్ రోడ్ నెం. 12 జంక్షన్లతో పాటు మాసాబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ, మెహిదీపట్నం జంక్షన్లలో ట్రాఫిక్ లోడు తగ్గుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ (ఐసీసీసీ) నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వద్దనున్న శిల్పా లే అవుట్ వరకు హెచ్ఎండీఏ మరో ఫ్లై ఓవర్ ను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సర్కారు ఆమోదం తీసుకున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రూ. 1600 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఐసీసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు దూరం తగ్గేలా డిజైనింగ్ రూపకల్పన స్థాయిలో ఉన్న ఈ ప్రతిపాదనకు సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read:Gas Shortage: గ్యాస్ కొరతపై యువజన కాంగ్రెస్ వినూత్న నిరసన