Mallanna: తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీ పెడతానని.. తాను స్వయంగా సీఎం కేసీఆర్ పైనే పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ పేరు, జెండా విధివిధానాలపై త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు.
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు, మూడు రోజుల్లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళతారన్న సమాచారం తమకు ఉందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా తాను అక్కడ పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ నేత ఈటల రాజేందర్ తాను వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తానని సవాల్ విసిరారు. ఇప్పుడు మల్లన్న సైతం కేసీఆర్ పైనే తన పోటీ అంటున్నారు. అటు, కాంగ్రెస్ ఎలానూ బరిలో ఉంటుంది. మరి, ఫోర్ యాంగిల్ వార్ ఎవరికి అనుకూలంగా మారుతుంది?
‘7200 ఉద్యమ పాదయాత్ర’ పేరుతో మల్లన్న చేస్తున్న పాదయాత్రకు పోలీసులు బ్రేకులు వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో, యాత్రను తాత్కాలికంగా నిలిపి వేశారు. హైకోర్టుకు వెళ్తానని చెప్పారు.
ఇక, మల్లన్నకు పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో ఆసక్తికర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాదయాత్రలో మల్లన్న ప్రసంగాలతో గొత్తికోయలంతా మావోయిస్టుల్లో చేరతారని పోలీసులు నోటీసులో తెలపడంపై.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం తానిచ్చిన ప్రసంగాలతో ఎంత మంది మావోయిస్టుల్లో చేరారని మల్లన్న ప్రశ్నించారు. కేసీఆర్ రాజ్యంలో పాదయాత్రలు చేయాలంటే న్యాయస్థానాల అనుమతి పొందాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పాడ్డాయని మల్లన్న మండిపడ్డారు.