Nirmal District Road Accident: దైవ దర్శనానికి వెళ్తున్న బావ మరదలిని, ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శ్రీశైలం దైవదర్శనానికి కారులో వెళ్తుండగా, అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో వారిద్దరు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి వద్ద గల నేషనల్ హైవే 44 పై చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ కు చెందిన విజయ్, సునీత, మరో ముగ్గురు కలిసి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం కారులో బయలుదేరారు. ఆ కారు బూరుగుపల్లి వద్దకు రాగానే అకస్మాత్తుగా కోతులు అడ్డుగా వచ్చాయి. కోతులను గమనించిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పింది. రహదారిపై కారు పల్టీలు కొట్టగా, కారులో ప్రయాణిస్తున్న వారు బిగ్గరగా కేకలు వేశారు. అంతలోనే మరో మారు కారు పల్టీ కొట్టగా, కారులోని విజయ్, సునీతలు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూశారు.
మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు కట్నా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక వైద్యశాలకు తరలించారు. దైవదర్శనానికి వెళ్తున్న విజయ్, సునీతలు బావ మరదలుగా వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
వీరిద్దరు కారు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. వారి రోదనలతో ప్రమాదం జరిగిన ప్రాంతం మార్మోగింది. కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న స్థానికులు సైతం పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్నారు.