Telangana New Ration cards: అమ్మో రేషన్ కార్డు రద్దు చేస్తున్నారట. ఇక నిత్యావసర సరుకులు అందుకోలేము. ప్రభుత్వ పథకాలతో కూడ లబ్ది చేకూరదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో రేషన్ కార్డులను తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారమే అంటోంది ప్రభుత్వం. ఈ పుకార్ల మధ్య తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాత రేషన్ కార్డులు తొలగిస్తారని ఇటీవల ప్రచారం ఊపందుకుందని, కొత్త జాబితాలో పేరు లేని అర్హులు కూడ ఆందోళన చెందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. ఇలా ఆందోళన చెందుతున్న వారికి మంత్రి ఏం చెప్పారంటే..
తెలంగాణలో జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డుల జారీలో పారదర్శకత పాటించాలని, లేనియెడల చర్యలు ఉంటాయని కూడ సీఎం హెచ్చరించారు. దీనితో కార్డుల జారీకి ఇటీవల జరిగిన కుటుంబ సర్వేను ప్రామాణికంగా అధికారులు తీసుకోనున్నారు. ఇలా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ సాగుతున్న వేళ, కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం స్పందించింది.
మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. అర్హత ఒక్కటే ప్రామాణికంగా రేషన్ కార్డులను జారీ చేస్తామన్నారు. పాత రేషన్ కార్డులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. అటువంటి వాటిని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే పాత రేషన్ కార్డులలో కొత్త పేర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని, అటువంటి వారు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల ప్రక్రియ సాగుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కోరారు.
Also Read: Shock to BRS: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ‘మీడియా’ పోల్.. ఊహించని ఫలితానికి అంతా షాక్
అలాగే రేషన్ కార్డుల జారీకి రూపొందించిన జాబితాలో పేరు లేదని కొంత మంది అర్హులు ఆందోళన చెందుతున్న విషయంపై కూడ మంత్రి క్లారిటీ ఇచ్చారు. లిస్ట్‌లో పేరు లేకపోతే ఆందోళన చెందొద్దని, అటువంటి వారు అర్హులైతే గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మంత్రి చేసిన ప్రకటనతో రేషన్ కార్డుల జారీపై ఆందోళన చెందుతున్న ప్రజలకు క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. అలాగే కొత్త జాబితాలో పేరు లేకపోతే, గ్రామసభల్లో దరఖాస్తు చేసే అవకాశాన్ని కూడ ప్రభుత్వం కల్పించింది. మరెందుకు ఆలస్యం డోంట్ ఫియర్.. అర్హత ఉంటే గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోండి మరి!