Bade Chokkarao Died : మావోయిస్టులపై కేంద్రం కన్నెరజేస్తుండడంతో దండకారణ్యంలో వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ – మారేడుబాక అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన తెలంగాణ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఈ విషయాన్ని మావోయిస్ట్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన తమ సహచరులకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపిన పార్టీ.. భారీ బలగాలతో తమపై దారుణంగా దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించింది. కేంద్ర బలగాల మోహరింపుతో.. అతిపెద్ద సైనిక మోహరింపు ప్రాంతంగా బీజాపూర్ నిలుస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర భద్రతా బలగాల కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ధృవపరుస్తూ.. బీజాపుర్ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 18 మంది మావోయిస్టు సహచరులను కోల్పోయినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మావోయిస్టు పార్టీ కీలక నాయకుడు బడే చొక్కారావు మృతితో.. దళం కీలక కమాండర్ ని కోల్పోయినట్లైందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌పై గతంలో రూ.50లక్షల రివార్డు ఉంది. ఇతని స్వస్థలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిగా పోలీసులు చెబుతున్నారు.
కొడుకా ఎక్కడున్నావ్..
తాజాగా పోలీసు బలగాల కాల్పుల్లో మృతి చెందిన దామోదర్.. గతేడాదే తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. తన సహచరుడు.. సీనియర్ నాయకుడు అయిన ఆజాద్ తో పోటీపడి ఈ పదవిని దామోదర్ దక్కించుకున్నారు. దామోదర్ ను జనజీవన స్రవంతిలో కలవాలని, మావోయిస్టుల కార్యకలాపాల నుంచి బయటకు వచ్చేయాలని పోలీసులు అనేక సార్లు సూచించారు. ఇటీవలే.. ములుగులోని దామోదర్ తల్లి బతుకమ్మను కలిసిన ములుగు ఎస్పీ శబరీష్.. ఆమెకు నిత్యవసరాలు అందించారు. ఆమె ఆవేదనను అందరికీ తెలియజేశారు.
తాను చివరి రోజుల్లో ఉన్నానని, ఓసారి వచ్చి చూసిపో బిడ్డా అంటూ దామోదర్ తల్లి బతుకమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. అజ్ఞాతం వీడి ఇంటికి తిరిగి రావాలని తన కుమారుడు చొక్కారావుకు బహిరంగంగా పిలుపునిచ్చారు. నువ్వు ఇంటికి రావాలే..నిన్ను చూసి సచ్చిపోతా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈలోగానే.. చొక్కారావు ఎన్ కౌంటర్లో మరణించాడు.
బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ – మారేడుబాక అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం.. ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో.. భద్రతా బలగాలు మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీ బంకర్‌ను గుర్తించాయి. మావోయిస్టులు దాచి ఉంచిన భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సొరంగల్ దేశవాళీ రాకెట్ లాంచర్లు, మందుగుండు సామగ్రి సహా.. విద్యుత్తు లైన్ నిర్మించే సిల్వర్ వైర్లును గుర్తించారు.
Also Read : మీకోసం మరిన్ని ఉద్యోగాలు రెడీ.. నిరుద్యోగులకు భట్టి విక్రమార్క బంపరాఫర్..
దేశంలోని మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర హోం శాఖ పకడ్భందీ వ్యూహంతో ముందుకు సాగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి, అక్కడ భద్రతా బలగాల మోహరింపులకు భారీగా ఖర్చు చేస్తోంది. ఇప్పటికే.. మావోయిస్టుల్ని లొంగిపోవాలని అనేక మార్లు పిలుపునిచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని వ్యాఖ్యానించారు. నక్సల్స్ అంతానికి జరిపే చివరి పోరాటానికి సమయం వచ్చిందంటూ ప్రకటించారు. బలమైన పకడ్బందీ వ్యూహంతో.. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామంటూ అనేక సార్లు అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ కార్యచరణలో భాగంగానే.. మావోయిస్టుల కంచుకోటల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకుపోతున్నాయి.