Nizamabad News: ఆస్తి కోసం.. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే కుమారులు.. కోడల్లు.. ఆస్తి కోసం ఓ కుమారుడు ఏకంగా బతికే ఉన్న తండ్రికి డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇంటిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని.. లోన్ కోసం తన తండ్రి చనిపోయినట్టు నమ్మించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన మదంశెట్టి ప్రసాద్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ప్రసాద్ పేరు మీద ఒక సొంత ఇల్లు ఉంది. ప్రసాద్‌కు కుమారుడు మదం శెట్టి ఆశిబ్ నాయుడు ఉన్నాడు. ప్రసాద్ భార్య రజనీ 2020 మార్చిలో చనిపోయింది. అప్పటి పంచాయతీ కార్యదర్శి రజని డెత్ సర్టిఫికేట్ జారీ చేసింది.
అయితే, తల్లి రజని డెత్ సర్టిఫికేట్ ఆధారం చేసుకుని 2021 డిసెంబర్‌లో తన తండ్రి ప్రసాద్ చనిపోయినట్టుగా నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించాడు కుమారుడు మదంశెట్టి అశిబ్ నాయుడు. ఈ డెత్ సర్టిఫికేట్‌తో తండ్రి ప్రసాద్ పేరు మీద ఉన్న ఇంటిని మదంశెట్టి ఆశీబ్ నాయుడు తన భార్య దయమణి పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంతే కాకుండా ఇంటిపేరు మీద బ్యాంకులో రుణం కూడా తీసుకున్నాడు.
ఇల్లు రిజిస్ట్రేషన్‌లో సాక్షిగా సంతకం పెట్టిన వ్యక్తి తండ్రి ప్రసాద్‌ను చూసి నువ్వు చనిపోలేదా అని అడిగాడు.. అయితే, నేను చనిపోవడం ఏంటని ఆశీబ్ నాయుడు తండ్రి ప్రసాద్ అవాక్కయ్యాడు. నేను మా ఆంధ్రాకు ఆరు నెలలు పోయి వచ్చానని అన్నాడు. దీంతో రిజిస్ట్రేషన్‌లో సాక్షిగా సంతకం పెట్టిన వ్యక్తి కొడుకు చేసిన ఘనకార్యాన్ని తండ్రికి వివరించాడు. అది విన్న ప్రసాద్ వెంటనే మెండోరా పోలీస్ స్టేషన్‌లో తాను బ్రతికుండగానే చనిపోయినట్టు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి తన పేర ఉన్న ఇంటిని తన కుమారుడు అతని భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని.. న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు.
Also Read: జైలు నుంచి దర్జాగా విడుదలైన ఖైదీ.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న పోలీసులు
2020లో తల్లి రజనీకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన నాటి పంచాయతీ కార్యదర్శి సుకన్య.. విషయం తెలుసుకొని తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని అశిబ్ నాయుడుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రసాద్ భార్య రజిని మృతి చెందినట్లు డెత్ సర్టిఫికేట్ ఇచ్చానని.. ప్రసాద్ మృతి చెందినట్లు తాను ఇవ్వలేదని తెలిపారు సుకన్య. ఆశీబ్ నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది సుకన్య.