కవితపై మల్లన్న వ్యాఖ్యల్ని ఖండించేందుకు కూడా కేటీఆర్ కి ట్వీట్ కూడా రాలేదు. ఎక్కడెక్కడో ఏదేదో జరిగితే ట్వీట్లు వేసి హడావిడి చేసే కేటీఆర్, సొంత చెల్లి వ్యవహారంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. అంటే రాజకీయాల్లో తనతో మంచిగా ఉంటేనే చెల్లెలిపై ఆయనకు ప్రేమ ఉంటుందా, తనతో విభేదిస్తే ఆయనకు కనీసం చెల్లెలు కూడా గుర్తు రాదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ కవిత-మల్లన్న వ్యవహారంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి..? కనీసం ఆ పార్టీ తరపున స్పందన ఉంటుందా, లేదా..?
కవితపై తీవ్ర వ్యాఖ్యలు..
ఎమ్మెల్సీ కవితపై మరో ఎమ్మెల్సీ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు. ఈ రెండు సంఘటనలు రాజకీయ సంచలనాన్ని రేకెత్తించాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో బీఆర్ఎస్ సైలెంట్ గా ఉండటం ఇక్కడ విశేషం. కేటీఆర్ కాదు కదా, హరీష్ రావు కానీ పార్టీ తరపున ఇంకే లీడర్ కానీ ఈ ఘటనపై నోరు మెదపలేదు. బీఆర్ఎస్ పార్టీ తరపున అధికారికంగా ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. కనీసం ఏ ఒక్కరూ మల్లన్న వ్యాఖ్యల్ని ఖండించలేదు.
అంత కోపమెందుకు..?
కేసీఆర్ కి కవిత రాసిన లేఖ లీక్ కావడంతో బీఆర్ఎస్ తో అసలు గొడవ మొదలైంది. కేసీఆర్ మినహా బీఆర్ఎస్ లో ఎవర్నీ తాను లీడర్లుగా గుర్తించడం లేదంటూ కవిత చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. దీంతో కేటీఆర్ బాగా హర్ట్ అయ్యారు. కేసీఆర్ ని కలిసేందుకు కవిత వెళ్లినా పెద్దగా స్పందన లేదని సమాచారం. మరోవైపు పార్టీ కూడా ఆమెను దూరం పెట్టింది. పార్టీ పరంగా కవిత పై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, ఆమె వ్యాఖ్యలపై స్పందించవద్దని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ దశలో కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలకు కూడా ఆ పార్టీ తరపున ఎవరూ రియాక్ట్ కాలేదు. పార్టీ పరంగా కాకపోయినా కుటుంబ సభ్యుడిగా అయినా కేటీఆర్ స్పందిస్తారని చాలామంది ఆశించారు. కవితపై మల్లన్న వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అవుతారని అనుకున్నారు. కానీ కేటీఆర్ సైలెన్స్ ఆ పార్టీలోనే చాలామందికి నచ్చలేదు. సొంత చెల్లెలిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వైరంతో చెల్లెలిపై అంత కక్ష పెంచుకోవాలా అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ లో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు కానీ, కేటీఆర్ ని నిలదీస్తూ పోస్ట్ లు పెట్టడం చర్చనీయాంశం అవుతోంది.
తన ఆఫీస్ పై దాడి జరిగిన సమయంలో కూడా బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలను ఎత్తి చూపారు ఎమ్మెల్సీ మల్లన్న. ఉనికి కోసమే కవిత తమ ఆఫీస్ పై దాడి చేయించిందన్నారాయన. ఉనికి కోసమే అయితే కేసీఆర్ ని అడగాలన్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై ఉన్న ఫ్రస్ట్రేషన్ తమపై చూపిస్తామంటే కుదరదని హెచ్చరించారు. పదేళ్లు తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుతిన్నదని మండిపడ్డారు.