Ginger In Monsoon: వర్షాకాలంలో.. వాతావరణం ఎంత ఓదార్పునిస్తుందో వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా వరకు పెంచుతుంది. ఇలాంటి కాలంలో.. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అల్లం ఒక సహజ ఔషధం.. ఇది రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్యకరమైన లక్షణాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా వర్షా కాలంలో దీనిని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
అల్లం యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వర్షాకాలంలో వచ్చే జలుబు, జీర్ణ సమస్యలు , ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న అల్లం గురించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అల్లం జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజితం చేసి, ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల ఈ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
3. జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం:
అల్లంలో జింజెరోల్ అనే పదార్థం ఉంటుంది. దీనికి యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు జలుబు, ఫ్లూ లక్షణాలైన గొంతు నొప్పి ,ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అల్లం టీ లేదా అల్లం రసం తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. అల్లం టీ, కషాయం తయారు చేసుకుని తాగినా కూడా జలుబు వంటి సమస్యలు తొందరగా తగ్గుతాయి.
4. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది:
వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు పెరిగే అవకాశం ఉంది. అల్లంలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను.. కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారు తరచుగా అల్లం తినడం వల్ల కూడా అనేక లాభాలు ఉంటాయి.
Also Read: మందార ఆకులను ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !
5. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది:
అల్లం అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్‌ల పెరుగుదలను నిరోధించే శక్తిని కలిగి ఉంటుంది. వర్షా కాలంలో నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవడానికి ఇది ఒక సహజమైన మార్గం. తరచుగా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తినే ఆహారంలో అధిక మోతాదులో అల్లం ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.
6. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది:
వర్షాకాలంలో చల్లని వాతావరణం కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అల్లం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది చలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.