OU Development: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు టెండర్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రూ.వెయ్యి కోట్లతో ఓయూను అంతర్జాతీయ విద్యాకేంద్రంగా.. అందుకు అనుగుణంగా మౌళిక వసతులు కల్పిస్తామని నేరుగా ఓయూకు వచ్చి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ విద్య, సంక్షేమ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఓయూ క్యాంపస్ లో బాలికలు, బాలురకు వేర్వేరుగా హాస్టల్, కిచెన్, డైనింగ్ నిర్మాణం కోసం రూ.270 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించింది. అలాగే అకడమిక్, నూతన డిపార్ట్ మెంట్ల బ్లాక్ నిర్మాణం, పరిశోధన, అభివృద్ధి బ్లాక్ నిర్మాణం కోసం మరో రూ.210 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించారు. మొత్తంగా రూ.480 కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టనున్నారు. మిగతా అభివృద్ధి పనులను సైతం త్వరలోనే ప్రారంభిస్తామని ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓయూ విద్యార్థుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ఇవాళ ముందడుగు పడిందని, ఓయూ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ తరఫును ప్రొఫెసర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా అత్యాధునిక మౌలిక వసతులు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
Also read: ఎంతో బిజీగా ఉన్నా ఆ పాటలు వింటే రిలాక్స్ అవుతా.. తన మ్యూజిక్ టేస్ట్ బయటపెట్టిన వేణుస్వామి!