Illegal Mining: స్వేచ్చ బ్యూరో: పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం సేకరించిన నిమ్జ్ భూముల్లో ఎర్రరాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం గణేష్‌పూర్ శివారులో నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను కొందరు అక్రమార్కులు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటూ ఎర్రరాళ్ల దందా కొనసాగిస్తున్నట్లు స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి కోసం సేకరించిన విలువైన భూముల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ వ్యాపారానికి కొందరు ప్రభుత్వ ఉద్యోగుల అండదండలు ఉన్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికారులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే అక్రమార్కులకు చేరడంతో, క్షణాల్లో తవ్వకాలకు ఉపయోగించే యంత్రాలు, వాహనాలను, కూలీలను అక్కడి నుంచి తరలించి పరారైయ్యారు.
అధికారుల రాకపై ముందస్తు సమాచారం ఎలా చేరిందన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. అధికారుల తనిఖీల సమాచారం ముందుగానే లీక్ అవుతోందా? ఈ అక్రమ దందా వెనుక ఎవరున్నారు? అక్రమార్కులకు ఎవరి అండదండలు ఉన్నాయి? అన్న సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు నిర్వహించే తనిఖీలతో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటం లేదని, అధికారుల పర్యవేక్షణ లోపం అక్రమ వ్యాపారులకు కలిసివస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
Also read: లెమన్ ఫిష్ రెసిపీ..తక్కువ మసాలాలతో అద్భుతమైన రుచి!
ఒకప్పుడు చదునుగా ఉన్న భూములు నేడు ఎక్కడికక్కడ లోతైన గోతులతో తవ్వకాలకు గురవుతున్నాయి. ఫలితంగా నిమ్జ్ భూములు వాగులను తలపించేలా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిమ్జ్ భూముల్లో జరుగుతున్న ఎర్రరాళ్ల తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారితో పాటు వారికి సహకరిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు శాశ్వత నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గణేష్పూర్ లో తరచూ అక్రమ తవ్వకాలు జరుపుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారనే నిమ్స్ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జహీరాబాద్ డీఎస్పీ సైదా ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ, హద్నూర్ ఎస్ఐ తనిఖీలు చేపట్టారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న పలువురిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, చట్టవిరుద్ధమైన తవ్వకాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
Also read: బంగారం.. ఆభరణంగా ఎప్పుడు, ఎలా మారిందో తెలుసా?