Mudhole news telugu(Telangana news live) : తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటనలు షురూ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాక రాక తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు షాకిచ్చారు ఆ గ్రామస్తులు.
ఎమ్మెల్యేకు కుర్చీ వేసి కూర్చొబెట్టి మంచినీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత తమ సమస్యలపై గళమెత్తారు. ఎన్నికలకు ముందే తాము గుర్తుకు వస్తామా అంటూ నిలదీశారు. వరదల వల్ల నష్టపోయిన తమకు ఏం సాయం చేశారంటూ కడిగేశారు ఆ గ్రామస్తులు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం నంద్ గావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డిని ఆ గ్రామస్థులు గట్టిగా ప్రశ్నించడం సంచలనం రేపింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలతో సింగన్ గావ్ మెయిన్ రోడ్ నుంచి నంద్ గావ్ గ్రామానికి వెళ్లే మార్గం కోతకు గురైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను కూర్చొపెట్టి మరీ నిలదీశారు. తొమ్మిది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇప్పటివరకు తమ గ్రామానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని నిలదీశారు.
ఎన్నికలు వచ్చినప్పుడు గుర్తుకు వస్తాము తప్ప.. ఇతర సందర్భాల్లో గుర్తుకు రామా అంటూ గ్రామస్తులందరూ ముక్తకంఠంతో ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని నిలదీశారు. దీంతో కంగు తిన్న ఎమ్మెల్యే గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. త్వరలోనే గ్రామంలోని సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చిన వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారు.