గురివింద కబుర్లు..!
నాటి ఘోరాల సంగతేంటి కేటీఆర్?
పట్నం రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనం
అభివృద్ధికి అడ్డుగా గులాబీ ముళ్లు పార్ట్ 2
⦿ వికారాబాద్ కలెక్టర్ హత్యకు కుట్ర కేసు
⦿ బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
⦿ 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు
⦿ అరెస్ట్ కాదు కిడ్నాప్ అంటూ కేటీఆర్ ఆగ్రహం
⦿ నిందితుడు సురేష్ బీఆర్ఎస్ నాయకుడే.. అయితే ఏంటంటే బుకాయింపు
⦿ మరి.. పదేళ్లు చేసిన ఘోరాల సంగతేంటి కేటీఆర్?
⦿ ఖమ్మం రైతుల నుంచి జర్నలిస్ట్ రఘు దాకా ఏం చేశారో తెలియదా?
⦿ నేరెళ్ల దళితుల థర్డ్ డిగ్రీ గురించి మాట్లాడు
⦿ ఆనాడు అన్నదాతలకు సంకెళ్లు ఎందుకు వేశావ్
⦿ తలుపులు పగులగొట్టి ప్రతిపక్ష నేతలను తీసుకెళ్లావ్ కదా
⦿ అలాంటి నువ్వా అరెస్టుల గురించి మాట్లాడేది?
⦿ కేటీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
⦿ అసలు.. నువ్వు అరెస్ట్ కావాలనేదే ప్లానా?
⦿ ప్రతీ విషయంలోనూ అదే తీరు.. తర్వాత బూమరాంగ్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Pharma Company Violence: ఒకరికి నీతులు చెప్తున్నామంటే, మనం కూడా నీతిమంతులై ఉండాలి. అలా కాకుండా, పాపాలన్నీ చేసి, అది కూడా బహిరంగంగా అందరికీ తెలిసేలా చేసి, ఎదుటివారికి క్లాసులు తీసుకుంటే నవ్వులపాలు కాక తప్పుదు. మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఆ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ హత్య కుట్రకు సంబంధించి పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అమాయక జనాన్ని ఉసిగొల్పింది బీఆర్ఎస్ నేత సురేష్‌గా తేల్చారు. అతను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, పైగా దాడికి ముందు ఆయనతో సురేష్ ఫోన్‌లో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్న పోలీసులు బుధవారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
14 రోజుల రిమాండ్.. విచారణ
వికారాబాద్ జిల్లా లగచర్లకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారుల దాడికి సంబంధించిన కేసులో పట్నం అరెస్ట్ కాగా, వికారాబాద్ డీటీసీ ఆఫీస్‌లో ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన్ను విచారించారు. వైద్య పరీక్షలు నిర్వహించి కొడంగల్ కోర్టకు తీసుకెళ్లారు. న్యాయస్థానం పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.
కోర్టుకు తరలించే సమయంలో కారులో నుంచే తన అరెస్ట్ అక్రమమని ఆయన మీడియాతో అన్నారు. ఇప్పటికే ఈ కేసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే, పట్నం అరెస్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సురేష్ బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే అని చెబుతూ, ఇది అరెస్ట్ కాదు కిడ్నాప్ అని అన్నారు. సీఎం స్వలాభం కోసమే ఫార్మా కంపెనీ అంటూ ఆరోపించారు. రైతుల్ని అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు
పట్నం అరెస్ట్ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఇంకా ఎన్నాళ్లు గురివింద కబుర్లు చెబుతారని ఫైరవుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన ఘోరాలను జనం ఇంకా మర్చిపోలేదని గుర్తు చేస్తున్నారు. అరెస్టుల గురించి మీరే మాట్లాడాలని సెటైర్లు వేశారు. ఖమ్మం రైతుల నుంచి జర్నలిస్ట్ రఘు దాకా మీరు చేసినవి అరెస్టులు ఎలా అవుతాయి, కిడ్నాప్‌లేగా అంటూ చురకలంటిస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని, రైతులకు సంకెళ్లు వేశారని, నేరెళ్ల దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అరెస్ట్ చేసిన తర్వాత 48 గంటల్లో కోర్టులో హాజరుపరచకుండా చాలామందిని చిత్రహింసలు పెట్టారని వివరిస్తున్నారు. ఆదిలాబాద్‌లో కోనేరు కోనప్ప అధికారులపై ఎలా దాడులు చేయించారో, వాటిని మీరు ఎలా ప్రోత్సహించారో ఎవరూ మర్చిపోలేదని, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడు అదే తీరుగా అధికారులపై దాడులు చేయిస్తున్నారని ఫైరవుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడూ ఆగడాలే, ప్రతిపక్షంలోనూ దాడులేనా అంటూ కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు హస్తం నేతలు. కోదండరాంను తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేసింది, బండి సంజయ్ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేసింది ఎవరని, ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తిప్పింది గుర్తులేదా అంటూ నిలదీస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల మీద దాడులు చేస్తుంటే, నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు అరెస్టులు చేస్తుంటే అవి కిడ్నాప్‌లు అవుతాయా? ఐఏఎస్ హత్యకు కుట్ర పన్ని ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదా అంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌పై మండిపడుతున్నారు.
అరెస్ట్ కోసం తాపత్రయం
ఫార్ములా ఈ – రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై చర్యల కోసం గవర్నర్ పర్మిషన్ అడిగింది ఏసీబీ. దీనిపై రేపోమాపో ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. దాదాపు ఏసీబీకి సానుకూలమేనన్న ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైతే గవర్నర్ దగ్గరకు పంచాయితీ చేరిందో అప్పటి నుంచి కేటీఆర్ ప్రతీ విషయంలో రాద్ధాంతం చేయడం ఎక్కువైంది.
తనను అరెస్ట్ చేయడం ఖాయమని అర్థం అయిపోయి, ఓవైపు ప్రభుత్వ కుట్ర అంటూనే ఇంకోవైపు సింపతీ వర్కవుట్ చేసేందుకు చూస్తున్నారు. ఇంకా ఇతర అంశాలపైనా ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. కానీ, ఏం చేసినా బూమరాంగ్ అవుతోంది. ఇప్పుడు లగచర్ల ఘటనలోనూ రివర్స్ కొట్టింది. గులాబీ లీడర్లు దాడులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుండడంతో జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇటు, ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకెళ్తామని చెబుతోంది.
రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ ప్రస్తావన
పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచారు పోలీసులు. ‘‘దాడి జరిగిన తర్వాత గ్రామంలో చాలా మందిని విచారించగా కుట్రకోణం దాగి ఉందని అర్థమైంది. గ్రామంలో సాక్షులను విచారించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా తెలిసింది. రైతులను ఉద్దేశపూర్వకంగా ఆయన రెచ్చగొట్టారు. హకీంపేట్, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్ల తండా, లగచర్ల గ్రామాలకు చెందిన రైతులను తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా ప్రభావితం చేశారు.
అధికారులపై దాడి చేసేలా రైతులను ఉసిగొల్పారు. దాడి చేసేందుకు కొందరు వ్యక్తులను ఏర్పాటు చేసి వాళ్లకు డబ్బులు ఇచ్చారు. మీకు ఏం జరిగినా చూసుకుంటాను అని హామీ ఇచ్చారు. అధికారులను చంపినా పర్లేదు నేను చూసుకుంటాను అని రైతులకు పటనం నరేందర్ రెడ్డి చెప్పారు’’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఏం జరిగినా తనతో సహా పార్టీ పెద్దలు అండగా ఉంటారని ఉసిగొల్పినట్టు తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో కేటీఆర్‌తో పాటు ఇతరుల ఆదేశాలున్నట్టు చెప్పారు.