Telangana News : దారుణం. అమానుషం. ఘోరం. ఉగ్రవాదుల కంటే ఉన్మాదం. మనుషులు కాదు వాళ్లు రాక్షసులు. స్కూల్ పిల్లలను చంపాలనే పైశాచికత్వం. కానీ, అదృష్టవశాత్తు ఆ కుట్ర ఫలించలేదు. స్కూల్ సిబ్బంది అప్రమత్తతతో విద్యార్థులు సురక్షితంగా బతికిపోయారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటన యావత్ తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే….
నీళ్ల వాడుతుంటే నురగలు..
సోమవారం జరిగిందీ దుర్గటన. ఆలస్యంగా వెలుగుచూసింది. శని, ఆదివారాలు స్కూల్‌కు సెలవు. మండే ఉదయం ఎప్పటిలానే ముందుగా బడికి వచ్చారు సిబ్బంది. పిల్లలకు ఉదయం అల్పాహారం వండేందుకు పాత్రలు శుభ్రం చేస్తున్నారు. అయితే, నీళ్లతో కడుగుతుంటే బాగా నురుగు రావడం గుర్తించారు. బ్యాడ్ స్మెల్ కూడా వస్తోంది. ఇదేంటి? ఇలా జరుగుతోందేంటి? అని అనుమానపడ్డారు.
స్కూల్ ట్యాంక్‌లో పురుగుల మందు
ఆ చెడు స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందోనని చుట్టుపక్కల పరిసరాలు గమనించారు. స్కూల్ ఆవరణలో వాళ్లకు పురుగుల మందు డబ్బా కనిపించింది. మరి, వాటర్ ఎందుకు స్మెల్ వస్తుందనే డౌట్‌తో పరీక్షించి చూడగా.. ఆ పురుగుల మందును స్కూల్ వాటర్ ట్యాంక్‌లోనే కలిపినట్టు గుర్తించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. విషయం స్కూల్ హెడ్‌మాస్టర్‌కు చెప్పారు. అప్పటికే విద్యార్థులు బడికి వచ్చేశారు. స్టూడెంట్స్ ఎవరూ డ్రింకింగ్ వాటర్ ట్యాప్‌ల వైపు వెళ్లకుండా కంట్రోల్ చేశారు.
వంట కర్రలపై కూడా..
వంట చేసే కర్రలపై కూడా పురుగుల మందు చల్లారని తేల్చారు. మధ్యాహ్న భోజనం వండటం ఆపేశారు. ధర్మపురి స్కూల్ HM ప్రతిభ.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Read : ఆ బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారా?
ఈ దారుణం ఏ దుర్మార్గుల పని?
ధర్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్లను చంపేందుకే ఇలా వాటర్ ట్యాంక్‌లో విషం కలిపి కుట్ర చేశారా? శని, ఆదివారాలు సెలవు కాబట్టి.. ఆకతాయి వెధవలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? తాగుబోతు చేష్టలా? అయినా, చిన్నపిల్లలను చంపాలని ఎందుకు అనుకున్నారు? ఎవరు ఆ పని చేశారు? గ్రామంలో గొడవలా? స్కూల్ టీచర్లపై కోపమా? ఏదైనా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చేసిన దారుణమా? ఘటనపై ఇలా అనేక రకాలైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల ఎంక్వైరీలో నిజాలు బయటకు రావాల్సి ఉంది.