CM Revanth Reddy: సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధంలేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికి, ఉన్నతాధికారులు యాక్షన్ లోకి దిగారు. ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ విష్ణుమూర్తి పై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం సస్పెండ్ కు గురైన ఏసీపీ విష్ణుమూర్తి, మీడియా సమావేశం నిర్వహించడంపై పోలీసు ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలకు ఉపక్రమించారు. రాష్ట్ర డిజిపి కి ఈ మేరకు నివేదికను సమర్పించనున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షంష్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విష్ణుమూర్తి మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా పోలీసులు మీద నిందలు వేస్తున్నారని, కేసులో ముద్దాయిగా గల హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టే అధికారం ఉందా అంటూ ప్రశ్నించారు. అలాగే ఒకసారి అల్లు అర్జున్ ఆధార్ కార్డు చెక్ చేసుకోవాలని, ఇంతకు తెలంగాణకు చెందినవారా కాదా అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. పోలీస్ అధికారులకు ఓపిక నశిస్తే ఎక్కడ ఏం కట్ చేయాలో అన్ని తమకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు విష్ణుమూర్తి.
అయితే సస్పెండ్ కు గురైన విష్ణుమూర్తి మీడియా సమావేశం నిర్వహించడంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించారు. సెంట్రల్ జోన్ డీసీపీ విడుదల చేసిన ప్రకటన మేరకు.. విష్ణుమూర్తి గతంలో నిజామాబాద్ డిఎస్పీ టాస్క్ఫోర్స్ గా పని చేశారని, ఆ తర్వాత ఆరోపణలపై డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 2024లో సస్పెండ్ కు గురయ్యారని, ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండా విష్ణుమూర్తి ప్రెస్ మీట్ నిర్వహించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
Also Read: CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే
ఇది తప్పనిసరిగా క్రమశిక్షణ నిబంధనల యొక్క స్పష్టమైన ఉల్లంఘనంగా తెలిపిన డీసీపీ క్రమశిక్షణ చర్యల కై డీజీపీకి నివేదికను అందించినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలను సహించబోమని ప్రవర్తన నియమాలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. అలాగే అల్లు అర్జున్ ఇంటి వద్ద ప్రశాంతత వాతావరణానికి భంగం కలగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.