Gelatin Explosives Items: ఛత్తీస్‌గఢ్‌కు చేరుతున్న జెలిటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలపై నిగ్గు తేల్చారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే మావోయిస్టులకు పేలుడు పదార్థాలు చేరుతున్నట్లు గుర్తించారు. కీసరలోని సాల్వో కంపెనీ నుంచే మావోయిస్టులకు.. పేలుడు పదార్థాలను సప్లై చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇటీవల మావోయిస్టులకు జెలిటిన్ స్టిక్ సరఫరా చేస్తున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కొంతకాలం ఆర్ఎంపీగా పని చేసిన రాము, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రభుత్వ టీచర్‌ను 2014లో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం మావోయిస్టులు రామును అడవికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స చేశాడు. మావోయిస్టుల విజ్ఞప్తితో పేలుడు పదార్థాలు సప్లై చేసేందుకు సిద్ధమయ్యాడు.
జగిత్యాలలో తనకు క్వారీలు ఉన్నాయని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసిన రాము, వాటిని మావోయిస్టులకు చేరవేశాడు. అలా, మరోసారి ప్రయత్నించగా, ధర్మపురి రోడ్డులోని పొలాస దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 400 జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 9 బెండిళ్ల డికార్డ్ ఫ్యూజ్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడనే దానిపై విచారించగా…అసలు విషయం బయటపడింది. పట్టుబడిన పేలుడు పదార్థాలు కీసర కేంద్రంగా తయారైనవేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
కీసరలో సాల్వోతోపాటు 3 కంపెనీల దాకా పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నాయి. వీటిలో ఏ కంపెనీ నుంచి మావోయిస్టులకు సప్లై చేశారన్నది సస్పెన్స్‌గా మారింది. సాల్వో ఇండస్ట్రీస్.. కీసర కేంద్రంగా పేలుడు పదార్థాలను తయారు చేస్తోంది. నిర్వాహకుడు జయరాం రెడ్డి ఇల్లీగల్ అనుమతులతో ఈ దందా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయ్. సర్కారు భూముల్లోనే సాల్వో ఇండస్ట్రీస్ సంస్థను నడిపిస్తున్నాడు.
Also Read: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
మావోయిస్టులే కాదు ఉగ్రవాదులకూ పేలుడు పదార్థాలు ఇక్కడి నుంచే వెళ్లాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రకు ప్లాన్ జరిగింది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో వారు సంచలన నిజాలను బయటపెట్టారు. నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇందుకు జిలిటెన్ స్టిక్స్ పెద్ద మొత్తంలో సేకరించారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.