Milla Magee: తెలంగాణ సర్కార్ హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ – 2025 పోటీల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ ఇంగ్లాండ్-2024 మిల్లా మాగీ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె మొదట వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి వైదొలిగినట్టు ప్రకటించింది. ఆ తర్వాత తను కావాలనే పోటీ నుంచి తప్పుకున్నట్టు.. తనను మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆట బొమ్మలా చూశారని.. వేశ్య లాగా ట్రీట్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ వార్తలపై మిస్ వరల్డ్ నిర్వాహకులు స్పందించిన విషయం తెలిసిందే. ఆమె చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అయితే తాజాగా మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయి శ్రీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. నిజంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలో నిజముందా..? లేదా కావాలనే అస్యతపు ఆరోపణలు చేస్తోందా? అనే దానిపై ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లను అడిగి పోటీల నిర్వహణ తీరులో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా..? అని వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
దేశ పరువు, ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఎప్పటికప్పుడు అధికారులను విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. కంటెస్టెంట్‌లతో పాటు మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నుంచి సైతం పోటీల వివరాలను గురించి కనుక్కుంటున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిల్లా మాగీ పాల్గొన్న డిన్నర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు..? ఆరోజు మాగీతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అధికారులు నివేదికను సమర్పించనున్నారు.
హైదరాబాద్‌లో ఉన్న సమయంలో రిచెస్ట్ పర్సన్స్ అయిన పురుష స్పాన్సర్లను అలరించాలని చెప్పడంతో.. ఎంతో ఒత్తిడికి గురయ్యానని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఓవైపు తెలంగాణ రాష్ట్రంపై గౌరవం పెరిగిందని, అతిథ్యం బాగుందని మెచ్చుకుంటూనే మేం పోటీలకు వచ్చామా..? దేనికొచ్చామో..? అర్థం కాలేదు.. ఇవేం పోటీలని వ్యాఖ్యానించింది.
ALSO READ: Milla Magee: మిస్ వరల్డ్ నుంచి నిష్క్రమించిన మిస్ ఇంగ్లాండ్.. తనని అలా చూశారంటూ ఆరోపణ
మిస్ వరల్డ్-2025 పోటీల నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన మిల్లా మాగీ ఇంగ్లాండ్ చేరిన తర్వాత చేసిన ఈ వ్యాఖ్యల్ని బ్రిటిష్ మీడియా ప్రచురించింది. ఆ తర్వాత ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరలయ్యాయి. అయితే ఈ వార్తలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లే కూడా ఖండించారు. ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. మిల్లా మాగీ వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ సైతం తప్పబట్టారు.