ఏపీ, తెలంగాణలో రాజకీయ పలుకుబడి ఉన్న పెద్ద ఫ్యామిలీలు ఆ రెండు. ఏపీలో వైఎస్ఆర్ ఫ్యామిలీ, తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ. కానీ రెండు కుటుంబాల్లో రాజకీయ సఖ్యత లేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత కొన్నాళ్లకు ఆ కుటుంబంలో అన్న, చెల్లెలు గొడవపడ్డారు, విడిపోయారు. ఇటు కేసీఆర్ కళ్లెదుటే ఆయన సంతానం వేరుదారులు చూసుకుంటున్నారు. అక్కడ ఇక్కడ పెద్దవాళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్లిద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడలేని నిస్సహాయత. ఏపీలో కూతురికి మద్దతుగా నిలిచారు వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ. మరి తెలంగాణలో కేసీఆర్ ఏవైపు ఉంటారు. కొడుక్కి మద్దతు తెలుపుతారా, కూతురి రాజకీయ భవిష్యత్ కి అండగా నిలబడతారా..?
జగన్ వర్సెస్ షర్మిల..
ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు కలసి మెలసి ఉండాలనుకుంటారు. కానీ అది అన్ని కుటుంబాల్లో సాధ్యం కాదు. పైగా బిడ్డలిద్దరూ ఒకే రంగానికి చెందినవారయితే అది మరీ కష్టం. రాజకీయాలు కూడా అందుకు మినహాయింపు కాదు. పైగా రాష్ట్రాన్ని ఏలిన కుటుంబాల్లో అయితే ఆధిపత్య పోరు మరింత ఎక్కువగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణలే వైఎస్ఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం. ఉమ్మడి ఏపీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం పిల్లలిద్దరూ పాలిటిక్స్ లో పెద్దగా యాక్టివ్ గా లేరు. అప్పట్లో జగన్ ఎంపీ అయినా కూడా వ్యాపారవేత్తగా బిజీగా ఉండేవారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఏకంగా ఆయన పార్టీ పెట్టడం, విభజన తర్వాత ఐదేళ్లకు ఏపీకి సీఎంగా మారడం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీకోసం కష్టపడి పనిచేసిన చెల్లెలితో ఆయనకు విభేదాలు మొదలయ్యాయి. ఆస్తుల వద్ద వచ్చిన గొడవలు, చివరకు రాజకీయంగా కూడా వారు వేరుదార్లు పట్టేలా చేశాయి. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిల, చివరకు కాంగ్రెస్ లో చేరి తిరిగి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అన్నతో ఆమె ప్రత్యక్ష పోరుకి దిగారు.
షర్మిలకు అండగా విజయమ్మ
వైఎస్ఆర్ ఫ్యామిలీలో వచ్చిన విభేదాలు ఇప్పుడల్లా పరిష్కారమయ్యే అవకాశాలు కనపడ్డంలేదు. అయితే ఈ విభేదాలలో కుటుంబ పెద్దగా ఉన్న తల్లి విజయమ్మ.. కూతురు షర్మిలకు మద్దతుగా ఉన్నారు. రాజకీయాల్లో కూడా ఆమెకే మద్దతిస్తూ మాట్లాడుతున్నారు. ఈ విషయంలో జగన్ కాస్త కోపంగా ఉన్నా బయటపడలేని పరిస్థితి.
కేటీఆర్ వర్సెస్ కవిత
ఇక తెలంగాణ రాజకీయాలకు వద్దాం. ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీలో వారసత్వ పోరు కొనసాగుతోంది. కేసీఆర్ తర్వాత నెక్ట్స్ ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. వరుసగా రెండు దఫాలు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. 2023లో కూడా గెలిచి ఉంటే ముఖ్యమంత్రిగా కేటీఆర్ ని ప్రకటించేవారనే ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ గెలవలేదు, కేటీఆర్ కి ఆ ఛాన్స్ రాలేదు. పోనీ వచ్చే ఎన్నికలనాటికి బలపడదామనుకుంటే ఈలోగా పార్టీలో ముసలం పుట్టింది. కూతురు కవిత రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆమె లేఖ సంచలనంగా మారింది. తండ్రికి పర్సనల్ గా రాసిన ఆ లేఖ బయటపడటం మరింత సంచలనం అయింది. దేవుళ్లు, దెయ్యాలు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారితీశాయి. కేటీఆర్, కవిత డైరెక్ట్ ఫైట్ జరుగుతోంది, ఇందులో విజేతలు బీఆర్ఎస్ లో కేసీఆర్ వారసులుగా కొనసాగుతారు, మిగిలిన వారు కొత్తదారి వెదుక్కుంటారు.
కేటీఆర్ వైపు కేసీఆర్ చూపు..
కేటీఆర్, కవిత.. ఈ ఇద్దరిలో కేసీఆర్ ఎవరికి మద్దతుగా ఉంటారనేది ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది. ఇద్దరిలో ఏ ఒక్కరినీ వదులుకోడానికి కేసీఆర్ ఇష్టపడరు. అలాగని పార్టీలో గొడవలు కంటిన్యూ అయితే అది మొదటికే మోసం. అందుకే ఇద్దరిలో ఒకరికి ఆయన మద్దతివ్వాలి. రాజకీయ వారసుడిగా కేటీఆర్ ని ప్రకటించి ఆయనకే కేసీఆర్ మద్దతిచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అటు వైఎస్ఆర్ ఫ్యామిలీలో తల్లి కూతురువైపు నిలబడగా, ఇటు కేసీఆర్ ఫ్యామిలీలో తండ్రి కొడుకునే సమర్థించబోతున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.