Kavitha Vs Mallanna : ఏ యుద్ధమైనా విధ్వంసమే. అంతా వినాశనమే. ఇరువర్గాలకూ తీవ్ర నష్టమే. రాజకీయాల్లో మాత్రం అలా కాదు. పొలిటికల్ వార్‌లో ఎవరో ఒకరికి తప్పకుండా బెనిఫిట్ వస్తుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కానీ, కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న లొల్లిలో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఎవరిది తప్పు? ఇంకెవరిది ఒప్పు? అనే చర్చ నడుస్తోంది.
కల్వకుంట్ల కవిత. ఉనికి కోసం బాగా కష్టపడుతున్న నేత. అన్నతో గొడవ. తండ్రికి దూరం. గులాబీ దండు మద్దతులేక అయోమయం. జాగృతి పేరుతో సొంతంగా ఎదిగే ప్రయత్నం. ప్రస్తుతం పుట్టెడు రాజకీయ కష్టాల్లో ఉన్నారామె. సరిగ్గా ఇలాంటి సమయంలో అనుకోని అవకాశంగా కలిసొచ్చింది తీన్మార్ మల్లన్న కామెంట్స్. దొరికిన ఛాన్స్‌ను వదులుకునే అల్లాటప్పా లీడర్ కాదామె. సరైన సమయంలో సరిగ్గా వాడేసుకున్నారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మల్లన్నతో పెట్టుకుంటే మంట చెలరేగుతుందని.. తన పేరు మారుమోగుతుందని.. ముందే లెక్కలేసి ఉంటారని అంటున్నారు. ఏకంగా క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేయించడం ఓ ఎత్తు అయితే.. మల్లన్న గన్‌మెన్ కాల్పులు జరపడం అనుకోకుండా కలిసివచ్చిన అడ్వాంటేజ్ అనే చెబుతున్నారు.
కవితకు సింపతీ అండ్ సపోర్ట్?
ఒక్క లొల్లితో కవిత ఇష్యూ తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ మహిళను అలా అంటారా? అనే సానుభూతి, సపోర్ట్ కూడా పెరిగిందామెకు. రాజకీయంగా కవిత గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ గొడవలో బీఆర్ఎస్ జోక్యం చేసుకోకపోవడం, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులాంటి నేతలు ఎవరూ మద్దతుగా నిలవకపోవడంతో.. కవిత పట్ల అయ్యో పాపం అనే సింపతి వస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌తో కారు వేరు, కవిత వేరు అనే మెసేజ్ క్లియర్ కట్‌గా జనాల్లోకి వెళ్లిపోయింది.
మల్లన్న మైలేజ్ పెరిగేనా తగ్గేనా?
లేటెస్ట్ గొడవతో తీన్మార్ మల్లన్నకు లాభమా? నష్టమా? అంటే డివైడ్ టాక్ వినిపిస్తోంది. ఆయన నోటి దురుసుతనంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. యూట్యూబ్ వ్యూస్ కోసం అన్ని పార్టీలను, నేతలను తిడుతూ వస్తున్నారు. బీసీ ఎజెండాతో సరికొత్త రాజకీయం చేస్తున్నారు. ఫ్యూచర్‌లో సీఎం కుర్చీపై కర్చీఫ్ వేసేలా ఇప్పటి నుంచే ప్లాట్‌ఫామ్ రెడీ చేసుకుంటున్నారని అంటారు. ఇలాంటి సమయంలో కవితతో ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. జాగృతి దండు ఆయన ఆఫీసుపై దాడి చేసి ధ్వంసం చేయడం కలకలం రేపింది. గన్‌మెన్స్ ఫైరింగ్‌తో మరింత రచ్చ జరిగింది. ఇప్పటికే కాంట్రవర్సీ లీడర్‌గా ఉన్న మల్లన్న చుట్టూ మరింత వివాదం రాజుకోవడం ఆయన ఇమేజ్‌ను కాస్త డ్యామేజ్ చేసే విషయమే అంటున్నారు. కాంగ్రెస్ సైతం మల్లన్న ఎపిసోడ్‌కు దూరంగా ఉండటంతో ఆ పార్టీ సపోర్ట్ లేకుండా పోయింది. అయితే, బీఆర్ఎస్‌ను, కల్వకుంట్ల ఫ్యామిలీని తీవ్రంగా వ్యతిరేకించే వర్గాలు మాత్రం ఆయనకు దగ్గరయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇలాంటి మాటలు, తిట్ల వల్లే మల్లన్న.. మాస్ మల్లన్నగా ఎమ్మెల్సీ స్థాయికి చేరారు. ఆ యాంగిల్‌లో ఆయన ఫ్యాన్ బేస్ మరింత పెరగొచ్చేమో. కవితను తిడితే సంబరపడే బ్యాచ్ ఆయనకు దన్నుగా నిలవచ్చేమో. ఇప్పటికే సొంతంగా, సింగిల్‌గా, బీసీ నినాదంతో ఎదగాలని చూస్తున్న చింతపండు నవీన్ కుమార్‌కు.. కవితతో లొల్లి మరింత కలిసిరావొచ్చేమో అంటున్నారు.
Also Read : కవితను మళ్లీ పిచ్చి తిట్లు తిట్టిన మల్లన్న..