Ponguleti Srinivasa Reddy: తెలంగాణ శాసనసభ సెక్రటేరియేట్‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఆసక్తికరమైన చిట్‌చాట్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ధరణి సమస్యలు, భూ రీ-సర్వేతో పాటు ఇందిరమ్మ ఇళ్లపై ఆయన పలు కీలక అంశాలను పంచుకున్నారు.
స్థానిక ఎన్నికలు & పార్టీ సమన్వయం
రాష్ట్రంలో సోషియో-ఎకనామిక్ అండ్ కాస్ట్ సర్వే ప్రక్రియ పూర్తిగా పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అయితే సర్పంచ్, ఎంపీటీసీ/జెడ్పీటీసీ ఎన్నికల్లో దేనికి ముందుగా వెళ్లాలనేది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. నాయకుల మధ్య పూర్తీ సమన్వయం ఉందన్నారు.
ధరణి అక్రమాలపై క్లారిటీ
రాష్ట్రంలో పారదర్శకత కోసం భూ రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతు బంధు సొమ్ము కొల్లగొట్టేందుకు క్షేత్రస్థాయిలో ఉన్న భూమి కంటే ధరణి పాస్‌బుక్‌లలో ఎక్కువ ఎకరాలు నమోదు చేశారని మంత్రి ఆరోపించారు. ధరణిలో క్లియర్ అయిన భూములకు త్వరలోనే ‘భూ భారతి’ ద్వారా పట్టాలు అందిస్తామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న చిక్కులను న్యాయ పరంగానే పరిష్కరిస్తామని చెప్పారు. రైతులకు వారి భూమి ఎక్కడుందో అక్కడే పొజిషన్ కల్పిస్తామన్నారు.
అసైన్డ్ భూముల సమస్యలు
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు ఉన్నాయని పొంగులేటి తెలిపారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వారి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వం యోచిస్తోందన్నారు. కొన్నవారు పూర్తిగా నష్టపోకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గతంలో ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూముల్లో కూడా అపార్ట్‌మెంట్లు నిర్మించేశారని గుర్తుచేశారు.
ఇందిరమ్మ ఇళ్లు – బీఆర్‌ఎస్ విమర్శలు
గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నాణ్యత లేక వర్షానికి కురుస్తున్నాయని, వాటికి త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, అది చూసి తట్టుకోలేకే బీఆర్‌ఎస్ నాయకులు తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు.
Also Read: అత్యవసర చికిత్సకు ‘మెట్రో’ అభయం… అవయవాల తరలింపులో సరికొత్త రికార్డు!