Ponguleti Srinivasa: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని కొన్ని ప్రాంతాల వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్దీకరించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగా ఈనెల చివరిలోగా భూముల ధరలను సవరించి అమలులోకి తీసుకువస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 సంవత్సరంలో ఆరునెలలు తిరగకుండానే రెండు సార్లు భూముల ధరలను అశాస్త్రీయ పద్దతిలో పెంచారని అన్నారు.కానీ ఆము ఆర్ధిక నిపుణులైన అరవింద్ సుబ్రహ్మణ్యం సలహాలు, సూచనల మేరకు శాస్త్రీయ పద్దతిలో విశ్లేషించి భూముల ధరలను సవరిస్తున్నామని వెల్లడించారు.శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు. రెవెన్యూ, హౌజింగ్ శాఖల్లోని పలు కీలకమైన విషయాలను వెల్లడించారు.
కేంద్రం నిధుల కోసం వెయిటింగ్..
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పధకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావలసిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామని, కేంద్రం ఒక్కో ఇంటికి సుమారు 1లక్షా13 వేల రూపాయిల వాటా విడుదల కావాల్సి ఉందని కేంద్రం నుంచి నిధుల వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ లబ్దిదారులకు ఫైనల్ బిల్ ఆపడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల కోసం పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు తాను కూడా ప్రాతినిధ్యం చేశామని చెప్పారు. ఆ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తూ మరోవైపు ప్రస్తుతం పూర్తయిన ఒక్కో ఇంటికి 1.60 లక్షల రూపాయిలను తాత్కాలికంగా ఆపామని , ఒకవేళ కేంద్రం మరో 15-20 రోజుల్లోగా విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్దిదారులకు నిధులు అందజేస్తుందని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ లో రెండవ విడత..
రాష్ట్రంలో తొలివిడత మూడున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇంతవరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని, జూన్ నెలాఖరుకల్లా 68-72 వేల ఇండ్లు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పధకాన్నిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. 2వ విడత మంజూరులో వివిధ రకాల వెసులుబాట్లను కల్పిస్తామని అన్నారు. గోడలు, బేస్‌మెంట్ లెవెల్, శ్లాబ్ వరకు ఉన్న గోడలు, శ్లాబ్ లేని ఇండ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు.
ఈ నెల 21న క్యాబినెట్‌లో చర్చ
రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలనే అంశాన్ని కూడా ఈనెల 21న క్యాబినెట్‌లో చర్చించి ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.గత 25 రోజులుగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ , రిజిస్ట్రేషన్ , సర్వే అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించి కొన్ని విషయాలపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని పరిష్కరించామన్నారు. ఈ సారి ప్రత్యేకంగా కలెక్టర్లు లేదా అదనపు కలెక్టర్లు, డిఎఫ్ఓలను సమావేశపరిచి రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులపై చర్చించి రోవర్ల సాయంతో సరిహద్దుల గుర్తింపుపై ఒక అవగాహన కల్పించామన్నారు.
సమగ్ర సర్వే కార్యక్రమం
సరిహద్దులను కచ్చితంగా ఖరారు చేసేలా ఆదేశించామన్నారు. 1/70 సమస్యపై కూడా చర్చించామన్నారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి రెవెన్యూ ఫారెస్ట్ మధ్య భూ సరిహద్దు వివాదాలు ఉన్నాయని వీటి పరిష్కారానికి జయింట్ సర్వే నిర్వహించి శాశ్వ పరిష్కారం చూపబోతామన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సమగ్ర సర్వే కార్యక్రమం చేపడతామన్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వర్ల డౌన్ అంశంపై దృష్టి సారించి కొత్త సాఫ్ట్ వేర్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు. సుమారు 14.08 కోట్లతో టెండర్ ఖరారు అయిందని,. మరో 3-4 నెలల్లో ఈ సమస్య తీరుతుందన్నారు.
పాతరేట్లతో 2 బీహెచ్ కే ఇండ్లు పూర్తి..
గత ప్రభుత్వహయాంలో అసంపూర్తిగా ఉండిపోయిన 2 బీహెచ్‌కే ఇండ్లకు సంబంధించి పాతరేట్లతో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను కోరామని మంత్రి తెలిపారు. అత్యధిక శాతం ఈ పనుల పూర్తికి ముందుకు రానందున లబ్దిదారులను ఎంపిక చేసి వారికే మిగిలిన మొత్తాన్ని ఇస్తూ వారిచేతనే పూర్తిచేయించేలా నిర్ణయించామన్నారు. ఈమేరకు ఈనెలాఖరులోగా ఇటువంటి ఇండ్లను గుర్తించేలా కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.పలు ప్రాంతాల్లో పదికిపైగా ఇండ్లు కలిగిన టవర్లను గుర్తించి వాటికి పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ, వాటి దిగువ కమర్షియల్ షాపులను లీజుకు బదులు పూర్తిగా బహిరంగ వేలంలో విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ప్రాతినిధ్యం కలిగిన పాలక వర్గం ఎకౌంట్‌లో వేయాలని నిర్ణయించామన్నారు.
మౌలిక సదుపాయాలు
గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 38 వేల ఇండ్లకు లబ్దిదారులను ఖరారు చేసిందన్నారు. తర్వాత ఏడాది పాటు సైంటిఫిక్ సర్వే నిర్వహించగా వీరిలో సుమారు 16వేల మంది అసలు ఆ ఇండ్లలో దిగలేదని తేలిందన్నారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటూ రోజూ సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించలేని పేదలకు వారు ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్లను కేటాయించాలని నిర్ణయించామన్నారు. అర్హులను ఎంపిక చేసి యుద్ధ ప్రాతిపదికన కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జిహెచ్ ఎంసీ పరిధిలో మూడు కార్పోరేషన్లలో పేదలకు ఇండ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఒకే స్థలంలో అన్నదమ్ములు కట్టుకునేలా..
ఒకే స్ధలంలో అన్నదమ్ములు ఇందిరమ్మ ఇండ్లను వన్ ప్లస్ వన్ పద్దతిలో కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. సుమారు 40-50 ఏళ్ల క్రితం కట్టిన వాంబే,ఎన్ ఆర్ జే ఎ ఎం ఎస్ తదితర కాలనీల్లో ఇండ్లు కూలిపోయే స్ధితికి చేరుకుంటున్నాయన్నారు. వాటి స్ధానంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు పరిశీలిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్దిదారులు స్ధానికంగా ఇసుకను ఉచితంగా పొందేలా, ఎర్త్ ఫిల్లింగ్ కుకూడా మట్టిని పొందేలా అవకాశం ఇవ్వాలని, ఎటువంటి అభ్యంతరాలు తెలుపకూడదని అధికారులను ఆదేశించామన్నారు.
కలెక్టర్లకు ఆదేశం
గతంలో ప్రైవేటు భూములను సేకరించి ఇండ్ల నిర్మాణానికి లేఅవుట్‌లు వేశారని, వాటిలో కొన్ని ఖాళీలు ఉన్నాయన్నారు. మరికొన్ని చోట్ల కబ్జాకు గురయ్యాయన్నారు. ధరణి కారణంగా గతంలో భూమి అమ్మిన వ్యక్తి పేరిటే మళ్లీ సదరు భూమి ఉన్నట్లు రావడంతో సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. ఇటువంటి అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. కబ్జాదారులను , ప్రభుత్వ భూమిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి నొక్కి చెప్పారు. అవసరమైన చోట ప్రభుత్వ భూములకు ప్రహారీతో రక్షణ కల్పిస్తామన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల రూ. 33 కోట్లతో హౌసింగ్ భూములకు కంపౌండ్ వాల్స్ నిర్మించామన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు పుల్ డిమాండ్..
పాలేరు నియోజకవర్గాన్ని 20 వేల ఓటర్ల చొప్పున 14 క్లస్టర్‌లుగా విభజించి ఇప్పటి వరకు 13 ప్రాంతాలలో ప్రజా దర్బార్ నిర్వహించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా 52 శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఉన్నాయన్నారు. తర్వాత స్ధానంలో ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్యలు,ఆసరా పెన్షన్లు, గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, రేషన్ కార్డులలో కుటుంబీకుల పేర్ల చేర్పు వంటివి ప్రాధాన్యతా క్రమంలో ఉన్నాయన్నారు. ఆసరా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కచ్చతమైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Also Read: స్త్రీనిధి ‘అసలు సిసలు’ మహిళా బ్యాంక్.. మంత్రి సీతక్క