Prajapalana Vijayothsavalu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. దీంతో శాఖల వారీగా కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్దం చేస్తున్నారు. శాఖల ప్రకారంగా మంత్రుల సారథ్యంలో కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. ఇక ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
రాష్ట్రంలో మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ అథారిటీ నేతృత్వంలో ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నారు. అదే విధంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 16 కొత్త నర్సింగ్ కళాశాలలతో పాటు 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా 208 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also read: హైడ్రా కమిషనర్ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ప్రచారం.. ఆ వార్తలపై స్పందించిన రంగనాథ్
ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ నియంత్రణ వాలంటీర్లుగా నియమిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజాపాలన వారోత్సవాల సందర్బంగా ఆసక్తి ఉన్న ట్రాన్స్ జెండర్లను గుర్తించి వారికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాలంటీర్లుగా నియమించనున్నారు. దామచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల ఒక యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి కూడా పునాది రాయి వేయనున్నారు. అటవీ, పర్యాటకశాఖల ఆధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్ లను సైతం ప్రారంభించనున్నారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తరగతులను ప్రారంభిస్తారు. కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన క్రీడా విశ్వవిద్యాలయానికి భూమిపూజ చేస్తారు. ఘట్ కేసర్ లో బాలికల కోసం ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్డ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఐ సిటీ ఏర్పాటు, ఇతరత్రా ఒప్పందాలు చేసుకుంటారు. వీటితో పాటూ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గోషామహల్ లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే నిర్మించిన ఆరు మురుగునీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభిస్తారు. కేబీఆర్ పార్కు సమీపంలో ఫైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణంతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు రూ.826 కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారు.