Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్ లోనే ఉంది అంటూ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. తన ఇల్లు బఫర్ జోన్ లో లేదని ఆయన స్పష్టం చేశారు. మధురానగర్ లో తాను నివాసం ఉంటున్న ఇంటిని దశాబ్దాల క్రితం తన తండ్రి కట్టించాడని చెప్పారు.
కృష్ణకాంత్ పార్కుకు దిగువన ఉన్న వేల ఇండ్ల తరవాత తమ ఇల్లు ఉందని చెప్పారు. ఒకప్పటి పెద్ద చెరువునే కృష్ణకాంత్ పార్క్ గా మార్చారని అన్నారు. చెరువుకట్టకు దిగువన 10 మీటర్లు దాటిన తరవాత ఉన్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ లోకి రావని స్పష్టం చేశారు. కట్టకు కిలో మీటరు దూరంలో తమ నివాసం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రూఫ్ చూపిస్తూ తమ ఇంటికి సంబంధించిన మ్యాప్ కూడా రంగనాథ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also read: రంగంలోకి పవన్.. మండలిలో వైసీపీ ఖాళీ..?
హైడ్రాపై అసత్య ప్రచారం
తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో చెరువులను కబ్జా చేసి నిర్మించిన గృహాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అదే విధంగా చెరువులోకి వర్షపు నీళ్లు రాకుండా బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. దీంతో చెరువులు నిండి హైదరాబాద్ లో భూగర్భజలాలు పెరగడంతో పాటు చిన్న వర్షానికే నగరంలో రోడ్డుపైకి వరద నీరు చేరకుండా ఉంటుంది.
అదే జరిగితే ట్రాఫిక్ జామ్ సమస్యలతో పాటూ ఎన్నో సమస్యలు నగర వాసులకు దూరం అవుతాయి. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో కొందరు హైడ్రాపై విషప్రచారం మొదలు పెట్టారు. హైడ్రా అన్ని అనుమతులు ఉన్న ఇండ్లను కూల్చివేస్తోందని ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోతుందని ప్రచారం మొదలు పెట్టారు.
అక్కడితో ఆగకుండా అధికార పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ వారి ఇండ్లు కూడా బఫర్ జోన్ లో ఉన్నాయని ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను సైతం వదిలిపెట్టలేదు. ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్ లోనే ఉందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ అనడంతో ఆ కామెంట్లు నిజమా? అబద్దమా? అని తెలుసుకోకుండా ప్రతిపక్ష పార్టీ అనుకూల మీడియాలో ప్రచారం చేయించి జనాలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయనే క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.