Dumping Yard: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగాపూర్, రాంపూర్ గ్రామాల పరిధిలో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజల పోరాటం ఉధృతమవుతోంది. మంగళవారం రెండో రోజుకు చేరుకున్న ఈ నిరసన దీక్షలు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తంగా కొనసాగాయి. ఈ ఆందోళనలో సింగాపూర్, తుమ్మనపల్లి గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ గ్రామాలు కాలుష్య కాసారాలుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి జయన్న ఫౌండేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ పేరుతో ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యం కారణంగా 15 కిలోమీటర్ల మేర ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. భూసారం దెబ్బతిని పంటలు పండని పరిస్థితి ఏర్పడుతుందని, భూగర్భ జలాలు కలుషితమై భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంలో మౌనంగా ఉండటం శోచనీయమని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఏకమై ఈ ప్రాజెక్ట్ రద్దయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
Also read: Assembly Attendance: లైవ్‌లో బట్టబయలైన ఎమ్మెల్యేల బండారం.. వీళ్ల అసలు రంగు ఇదేనా అంటూ..?
ఈ నిరసన కార్యక్రమంలో సింగాపూర్, తుమ్మనపల్లి గ్రామాల సర్పంచ్ లు కల్వల సంపత్, అన్నాడి మాధవి రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లు పాకాల నారాయణరెడ్డి, కేసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు యాళ్ల రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు కేశవేణి మోహన్, గుడిపాటి చందు, గ్రామస్తులు రజనీకర్ రెడ్డి, హరీష్, కేశవేని బుచ్చిమల్లు, ఇంద్రసేనారెడ్డి, కమల్ , ఊరడి ధర్మారెడ్డి, బొక్కల రత్నాకర్ రెడ్డి, బొక్కల వీరారెడ్డి, ఉరటి రాజు, గోపిడి రాజిరెడ్డి సహా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు, గ్రామస్తులు భారీ ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Also read: Illegal Mining: పోలీసు వాహనంపై ట్రాక్టర్‌తో దాడి కలకలం.. అడ్డొస్తే చంపేస్తారా..?