Revanth Reddy : రా కదలిరా.. రేవంత్ రెడ్డి పిలుస్తుండు కదలిరా కాంగ్రేసోడా..
మత్తు వదిలి, శక్తి పుంజుకొని సైనికుడివై రా కదలిరా.. మునుగోడుకు తరలిరా…
ఆలోచించకు.. అనుమానించకు.. వెనకడుగు వేయకు.. నీ అవసరం ఉందిక్కడ.. కాంగ్రెస్ ను గెలిపించాల్సిన సమయం వచ్చిందిప్పుడు.. పార్టీ రుణం తీర్చుకునేందుకు, మునుగోడులో పాల్వాయి స్రవంతిని గెలిపించేందుకు సమరోత్సాహంతో దూసుకురా.. రా కదలిరా..
తెలంగాణలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కోసం మునుగోడులో ఎదురుచూస్తున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా కదలిరావాలని.. మునుగోడులో కలిసి కదం తొక్కుదామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు ఇవ్వడం సంచలనంగా మారింది.
రేవంత్ రెడ్డి నుంచి ఇలాంటి పిలుపు కాంగ్రెస్ శ్రేణుల్లో కదలిక తీసుకొస్తోంది. రేవంత్ అంతటి వారే తమని మునుగోడుకు పిలుస్తుండటంతో.. కేడర్ అంతా అక్కడికి క్యూ కడుతున్నారు. రేవంత్ కు అండగా నిలిచేందుకు.. కాంగ్రెస్ అభ్యర్థికి దన్నుగా ఉండేందుకు.. ప్రచారంలో ప్రత్యర్థులను ఢీ కొట్టేందుకు.. వేలాదిగా కాంగ్రెస్ వాదులు మునుగోడు నియోజకవర్గానికి తరలి వస్తున్నారు. రేవంత్ పిలుపు అనూహ్య ప్రభావం చూపిస్తోంది. మునుగోడు కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడుతోంది. రేవంత్ స్ట్రాటజీ బాగా వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది.
ధన, అధికార బలంతో మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు నానా అరాచకాలు చేస్తున్నాయనేది కాంగ్రెస్ ఆరోపణ. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గ్రామాల్లో మోహరించింది కారు పార్టీ. మందు, విందు, డబ్బు, దావత్ లతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని అంటున్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అత్యంత సంపన్నుడు కావడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ బలం, ధనం ముందు కాంగ్రెస్ అభ్యర్థి నిలబడలేకపోతున్నారు. గులాబీ దళం తన బలగాన్నంతా మునుగోడుకు తరలించి.. ప్రచారంతో ఊదరగొడుతోంది. కాంగ్రెస్ లో మాత్రం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటమే చేస్తున్నారు. సీనియర్లు సహకరించడం లేదని.. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఇప్పటికే ఆరోపించారు రేవంత్ రెడ్డి. అన్నట్టుగానే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతతో చెప్పే ఆడియో వైరల్ కావడం కలకలం రేపింది. ఇలాగైతే పని జరగదని.. రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు.
టీఆర్ఎస్, బీజేపీ ఏకమై కాంగ్రెస్‌ను ఒంటరి చేయాలని చూస్తున్నాయని రేవంత్ అన్నారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్‌లను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులు, స్థానిక అధికారులు టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నారని తప్పుబట్టారు.
ఆడబిడ్డ అని కూడా చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు పాల్పడ్డారని.. కాంగ్రెస్ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా? అని కేడర్ ని ప్రశ్నించారు. కార్యకర్తలే తన బలం, బలగం అంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గానికి స్వచ్ఛందంగా తరలిరావాలని.. పాల్వాయి స్రవంతికి మద్దతుగా ప్రచారం చేయాలని పిలుపు ఇచ్చారు. రేవంత్ కేక.. పార్టీలో కాక రేపింది. సో కాల్డ్ సీనియర్లంతా హస్తానికి హ్యాండ్ ఇవ్వగా.. కార్యకర్తలనే నమ్ముకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో ఒంటరిగా ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యారు.