RaghunandanRao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నానని, తనకన్నా బాగా పని చేసే నాయకుడు రాష్ట్ర బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగానే ఉందని, ఆ పదవిని తనకు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానని.. బీజేపీలోని అన్ని పదవులకు తాను అర్హుడనని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్, జాతీయ అధికార ప్రతినిధి.. ఈ మూడు పదవుల్లో ఏదో ఒకటి తనకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు రఘునందన్. అసలు, బీజేపీకి ఫ్లోర్ లీడరే లేరనే విషయం నడ్డాకు తెలీదని.. తాను చెబితే నిజమా? అని ఆశ్చర్యపోయారని చెప్పారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే.. తనకు ప్రాధాన్యం ఇవ్వకపోతే.. నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానన్నారు రఘునందన్‌రావు. ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసి.. పార్టీ పెద్దలను కలుస్తున్నారాయన.
పార్టీ అధ్యక్షుడిని మార్చుతారంటూ జరుగుతున్న ప్రచారం నిజమేనన్నారు రఘునందన్‌రావు. అదంతా బండి సంజయ్ స్వయంకృతాపరాధమని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు అందర్నీ కలుపుకొని కార్యక్రమాలు చేపట్టాలని, అంతా తానై వ్యవహరిస్తానంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, నేతలు పార్టీకి దూరమవుతారని హెచ్చరించారు.
పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్.. 100 కోట్ల ఖర్చుతో యాడ్స్ ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. అదంతా పార్టీ ఫండ్ అని.. అందులో తనకూ వాటా ఉంటుందని అన్నారు. అదే 100 కోట్లు తనకు ఇస్తే.. తెలంగాణను దున్నేసేవాడినని చెప్పారు. కేసీఆర్‌ను కొట్టే మొగోడ్ని తానేనని జనాలు నమ్మారని.. తన గెలుపు చూసే ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు.
తాను బీజేపీ జెండాతో ప్రజల్లోకి వెళ్లి గెలవలేదని, ప్రజల్లో తనకున్న బలం వల్లే, స్వశక్తితో గెలిచానని రఘునందన్ అన్నారు. ఎవరూ ఒక్క రూపాయి సాయం చేయకపోయినా గెలిచానని, రెండోసారి కూడా గెలిచి చూపిస్తానని సవాల్ విసిరారు. అంతా తాను చూసుకుంటానని.. అమిత్ షా ఆ అభ్యర్థి భుజం తట్టినా ఫలితం లేదని, 100 కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలవలకపోయారని రఘునందన్ కలకలం రేపారు.
రాష్ట్రంలో ఉన్న నేతల ఫోటోలు ప్రకటనల్లో వేస్తే ఓట్లు పడతాయని, అంతేకానీ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఫోటోలు వేస్తే ఎవరు ఓట్లు వేస్తారని నిలదీశారు. ఈటల, రఘునందన్ బొమ్మలుంటేనే బీజేపీకి ఓట్లు పడతాయని అన్నారు.
అయితే, మీడియా చిట్‌చాట్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బ్రేకింగ్ న్యూస్‌లుగా హోరెత్తడం.. పార్టీలో కలకలం రేపడంతో.. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు రఘునందన్. ఢిల్లీలో మీడియాను పిలిచి.. తూచ్ తానలా అనలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. అంతా మీడియా దుష్ప్రచారం అంటూ చెప్పుకొచ్చారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే వ్యక్తిని కాదన్నారు. నాయకత్వ మార్పు అనేది కేంద్రనాయకత్వం పరిధిలోనిదని.. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని సెలవిచ్చారు.