Big Stories

Cable Bridge : గుజరాత్ లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్

Cable Bridge : గుజరాత్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ పట్టణంలో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. దీంతో చాలా మంది సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై 400 మంది ఉన్నారని సమాచారం. వీరిలో 100 మందికి పైగా నదిలో పడిపోయారని అంచనా వేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించారు. 140 ఏళ్ల క్రితం మచ్చూ నదిపై ఈ వంతెన నిర్మించారు. నాలుగురోజుల క్రితమే మరమ్మతు పనులు పూర్తి చేసి తిరిగి సందర్శకుల కోసం తెరిచారు. ఆదివారం సాయంత్రం సమయంలో భారీగా జనం ఈ వంతెనపైకి చేరుకున్నారు. సామర్థ్యానికి మించి సందర్శకులు చేరుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

తీగల వంతెన కూలిన ఘనటపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ కు ఫోన్‌ చేసి మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలను తరలించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారని పీఎంవో కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఈ ఘటనపై గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్యసాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఈ వంతెన 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్‌ రిచర్డ్‌ టెంపుల్‌ ప్రారంభించారు. అప్పట్లో రూ.3.5లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ ఇంగ్లండ్‌ నుంచి తెప్పించారు. దర్బార్‌గఢ్‌ -నాజర్‌బాగ్‌ను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన పొడవు 765 అడుగులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News