Rains in AP Telangana States: రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో గత మూడు రోజుల నుంచి భిన్న వాతావరణం నెలకొంది. గత రెండు మూడు రోజులుగా ఓవైపు ఎండలతో పాటు మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో తీవ్రస్థాయిలో పంట నష్టం కలిగింది. ఇక రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో తక్కువగా ఉష్టోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది. అయితే రాబోయే రెండు రోజులు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్లు, విద్యుత్ స్థంబాల దగ్గర ఎవరు ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలోనూ వర్షాలు..
ఏపీలోని మన్యం జిల్లాలోని పాలకొండ, సీతంపేట, అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లాలోని ఆస్పరి, శ్రీ సత్యసాయి జిల్లాలోని తొగరకుంటలో 40.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీసత్యసాయి జిల్లా ఒరవోయ్ లో 34 మిమీ, వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లి 27 మిమీ, ముద్దనూరు లో 19.7 మిమీ, కర్నూలు జిల్లా వెల్దుర్తిలో 18.7మిమీ వర్షపాతం, 17 ప్రాంతాల్లో 10 మిమీ కు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు.
కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం..
రెండు తెలుగు రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిన్న పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. వర్షం కారణంగా కొందరి రైతుల పంటల్లో భారీగా వరద నీరు చేరుకుంది. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. అకాల వర్షాలు పట్ల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: JOBS: తెలంగాణలో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. స్టార్టింగ్ జీతమే రూ.60,000.. మీరు కూడా అర్హులే..!