IPL Madness : దేశంలో ఐపీఎల్ సీజన్ మొదలైంది. క్రికెట్ ప్రేమికులకు ఇక పండుగే.. ఎంతటి ముఖ్యమైన పనులున్నా.. అన్నింటినీ పక్కన పెట్టేసి అభిమాన జట్టు గెలుపోటముల్ని దగ్గరుండి చూస్తుంటారు. విద్యార్థుల నుంచి పెద్దల వరకు అయితే టీవీలు, లేదంటే సెల్ ఫోన్లల్లో తలలు పెట్టేసి.. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనంతగా లీనం అయిపోతుంటారు. కానీ.. ఇలాంటి ధోరణి అన్ని సార్లు సరైంది కాదని నిరూపిస్తోంది.. ఓ ఘటన. 50-60 మంది ప్రాణాలకు బాధ్యుడిగా ఉన్న ఓ బస్సు డ్రైవర్.. ఓ వైపు సెల్ ఫోన్లో మ్యాచ్ చూస్తూ.. బస్సు నడిపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.
ఈ ఘటన మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) బస్సులో చోటు చేసుకుంది. మార్చి 22న ముంబై-పుణె రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ బస్సులో ఈ సంఘటన జరిగింది. ఈ సమయంలో డ్రైవర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రయాణికుడు.. వీడియో తీశాడు. అతని నిర్లక్ష్యపూరిత వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియోను అప్ లోడ్ చేశాడు. అంతే.. కొన్ని నిముషాల్లో ఆ వీడియో వైరల్ గా మారిపోయింది. అత్యంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన సదరు వ్యక్తిని MSRTC విధుల్లో నుంచి తొలగించింది.
MSRTC బస్సు డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. అతని ప్రాణంతో పాటుగా వెనుక బస్సులోని పదుల సంఖ్యలోని జనాల ప్రాణాలకు అతనే బాధ్యుడు.. కానీ, ఈ వ్యక్తి మాత్రం డ్రైవింగ్ చేస్తూ మొబైల్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ.. అందులో మునిగిపోయాడు. ముంబై-పుణే హైవేపై బస్సును పూర్తి వేగంతో నడుపుతూ క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు.
ప్రతీ బాల్, ప్రతీ పరుగు ఎంతో ఉత్కంఠకు గురి చేసే ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ.. ప్రయాణికులు వీడియో తీస్తున్న విషయాన్ని కూడా గమనించుకోలేదు ఆ డ్రైవర్. అతని ప్రవర్తకు భయపడిపోయిన ప్రయాణికుల్లో కొందరు.. రహస్యంగా వీడియో తీసారు. వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. MSRTC, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా కీలక అధికారులను ట్యాగ్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ అధికారులను ఆదేశించారు.
మంత్రి జోక్యం తర్వాత.. రవాణా సంస్థలో అద్దె ప్రాతిపదికన నడుపుతున్న శివనేరి సర్వీస్ పై యాక్షన్ తీసుకున్నారు. ఈ ప్రైవేట్ ఆపరేటర్ వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌ను విధులకు హాజరుకాకుండా పూర్తిగా తొలగించారు. అలాగే.. ప్రయాణీకుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా MSRTC సంస్థ సదరు ప్రైవేట్ ఆపరేటర్‌కు రూ. 5,000 జరిమానా విధించింది. ఈ నిర్లక్ష్యంపై రవాణా మంత్రి సర్నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, “ముంబై-పుణె మార్గంలో శివనేరి ఒక కీలకమైన బస్సు. ఈ బస్సులో చాలా మంది ప్రయాణిస్తారు. ఈ బస్సు ఇంత వరకు ఎలాంటి ప్రమాదాలకు గురి కాలేదు. అలాంటి చోట్ల.. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ప్రయాణీకులను ప్రమాదంలో పడేసే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరం అని అన్నారు.
Also Read : Anti Drone System : సరిహద్దుల్లో డ్రోన్ల ఆగడాలకు చెక్ – DRDO అద్భుత ఆవిష్కరణ
MSRTC కింద పనిచేసే ప్రైవేట్ ఆపరేటర్లకు కఠినమైన డ్రైవర్ శిక్షణా కార్యక్రమాల అవసరాన్ని సర్నాయక్ మరోసారి గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా, ఆటోరిక్షాలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వినోదం కోసం మొబైల్ ఫోన్‌లను ఉపయోగించే సమస్య పెరుగుతున్నందున, ఈ సమస్యను అరికట్టడానికి కొత్త నిబంధనలు అవసరం అని, వాటి కోసం ప్రణాళికలు తయారు చేయనున్నట్లు ప్రకటించారు.