Pre Launch Scam: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన.. మరో మోసం వెలుగులోకి వచ్చింది. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీకాంత్‌పై.. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఫ్రీ లాంచ్ ఆఫర్లు పేరుతో ప్రాజెక్టులు ప్రకటించి కోట్లలో డబ్బులు వసూలు చేసి.. వందలాది కుటుంబాలను మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రాజెక్టుల పేరుతో మోసం
సరూర్‌నగర్, బోడుప్పల్, తట్టియన్నారం ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, వెంచర్‌లు ప్రారంభిస్తున్నామంటూ శ్రీకాంత్ భారీ ఎత్తున ప్రచారం చేశాడు. తక్కువ ధరలో ప్లాట్లు, ముందస్తు బుకింగ్ ఆఫర్లు, ఫ్రీ లాంచ్ స్కీమ్స్ అంటూ ప్రజలను ఆకర్షించాడు. అతని మాటలను నమ్మి వందలాది మంది తమ కష్టార్జిత సొమ్మును పెట్టుబడిగా పెట్టారు. అయితే ఆ ప్రాజెక్టులు ఎక్కడా అభివృద్ధి కాలేదని, కాగితాలపై మాత్రమే ఉన్నాయని పోలీసులు తేల్చారు. మొత్తం మూడు ప్రాజెక్టుల పేరుతో రూ. కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు.
బాధితుల ఆవేదన
ఈ మోసానికి గురైన సుమారు 40 కుటుంబాలు.. ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాయి. తాము సంపాదించుకున్న డబ్బు అంతా ఈ ప్రాజెక్టుల్లో పెట్టామని, ఇప్పుడు అది అంతా వృథా అయిపోయిందని వాపోయారు.
పోలీసులు చర్యలు
ఫిర్యాదుల మేరకు ఎల్‌బీ నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలోనే కోట్ల రూపాయల మోసం జరిగినట్లు తేలడంతో, ఎండి శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. సంస్థ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమంది ప్రమోటర్లు, మధ్యవర్తులు కూడా ఉన్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ఫ్రీ లాంచ్ ఆఫర్లలోని ప్రమాదం
ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో “ఫ్రీ లాంచ్” అనే పేరుతో.. ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఇంకా భూమి లే అవుట్ లేదా ప్రభుత్వ అనుమతులు పూర్తిగా రాకముందే, బుకింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం. ఇలాంటి ప్రాజెక్టుల్లో నిబంధనలు లేకపోవడంతో.. కొనుగోలుదారులు చివరికి మోసపోతున్నారు. ఈ క్రమంలో కృతికా ఇన్ఫ్రా మోసం రియల్ ఎస్టేట్ రంగంలోని అసలు విషయం బయటపెట్టింది.
వాసవి రియల్ ఎస్టేట్‌పై ఐటీ సోదాలు
ఇక బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయంలో.. కూడా ఐటీ శాఖ సోదాలు జరిపింది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్రమ లావాదేవీలు, పన్ను ఎగవేతలపై ఐటీ అధికారులు సమాచారం అందుకుని ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఆర్థిక రికార్డులు, ఒప్పందాలు, లావాదేవీలపై అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుతున్న అవకతవకలు
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా ఎదుగుతున్నా, ఇందులో అవకతవకలు కూడా పెరుగుతున్నాయి. సరైన ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ప్రకటించడం, తప్పుడు వాగ్దానాలతో డబ్బులు వసూలు చేయడం, లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడం వంటివి తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
ప్రజలకు హెచ్చరిక
నిపుణులు చెబుతున్నట్లుగా, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రభుత్వ అనుమతులు (HMDA, RERA) ఉన్నాయా లేదా అని పరిశీలించాలి.
పత్రాలను న్యాయ నిపుణుల ద్వారా వెరిఫై చేయించుకోవాలి.
“ఫ్రీ లాంచ్ ఆఫర్” లేదా “అసలు కంటే తక్కువ ధర” అనే మాటలను నమ్మకూడదు.
Also Read: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. బంగారం షాపుల యజమానుల్లో టెన్షన్
నమ్మకమైన డెవలపర్‌లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.