BigTV English

Warangal: వరంగల్ విలయం.. ప్రకృతి పగా? పాలకుల వైఫల్యమా?

Warangal: వరంగల్ విలయం.. ప్రకృతి పగా? పాలకుల వైఫల్యమా?
warangal floods

Warangal: వరంగల్‌ ముంపు ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 30 కాలనీలు వరద ఉధృతిలో చిక్కుకున్నాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరంగల్‌లో వరదల్లో చిక్కుకున్న బాధితులకు అధికారులు ఆహార పొట్లాలు అందిస్తున్నారు. మామునూరు హెలీ ప్యాడ్ నుండి ఏటూరు నాగారం – కొండాయిలో చిక్కుకున్న బాధితులకు హెలికాప్టర్‌ ద్వారా ఆహారం అందజేస్తున్నారు.


ట్రై సిటీస్‌లో వరద విలయం కొనసాగుతోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలోని వందలాది కాలనీలు ఇప్పుడు చెరువులను తలపిస్తున్నాయి. ఒకప్పుడు బండ్లపై తిరిగిన వారు.. ఇప్పుడు పడవల్లో ప్రయాణించాల్సి వస్తుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఎటూ చూసినా వరద నీరు తప్ప.. ఇంకేమీ కనిపించని దుస్థితి ఉంది.

వరంగల్‌ లో ప్రధానంగా శివనగర్‌, వరంగల్‌ చౌరస్తా, రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ ఏరియా, అండర్‌ రైల్వే గేట్ ప్రాంతాలు నీటమునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎన్నడూ లేని విధంగా వరంగల్ కాలనీలను వరద ముంచెత్తింది. ఏకంగా 200 కాలనీలు నీట మునిగాయి. 2020 ఆగస్టులో వచ్చినదాంతో పోలిస్తే రెట్టింపు వరద పోటెత్తింది. చెరువులు అలుగు పారడంతో వరద కాలువలు ఉగ్రరూపం దాల్చాయి. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల్లోని ప్రధానమైన నాలాలు ఆక్రమణలతో కుంచించుకుపోవడంతో ఈ సమస్య నెలకొంది. నాలాలు విస్తరించి, శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో కాలనీలు నీట మునిగాయని నిపుణులంటున్నారు.


కాజీపేట సోమిడికుంట, పెద్ద వడ్డేపల్లి చెరువు, గోపాల్‌పూర్‌ చెరువుల వరద నీరంతా కేయూ హండ్రెడ్ ఫీట్స్‌ రోడ్డు, విద్యానగర్‌, నయీంనగర్‌, పెద్దమ్మగడ్డ 100 ఫీట్ల రోడ్డు, భగత్‌సింగ్‌ నగర్‌ మీదుగా నాగారం చెరువు వైపు వెళ్తాయి. మూడేళ్ల కిందట 50 శాతం ఆక్రమణలు తొలగించారు. అయినా సరే ఈప్రాంతంలో 25 కాలనీలు నీట మునిగాయి.

హనుమకొండ ప్రాంతంలో నయీంనగర్‌ నాలా చాలా కీలకం. నగరం నడిబొడ్డు నుంచి వెళ్తుందీ నాలా. హంటర్‌రోడ్‌ ఏరియా ప్రమాదకరంగా మారింది. దాదాపు కిలోమీటర్‌ మేర నీరు నిలిచిపోయింది. బొందివాగు నాలా నుంచి వరద నీరంతా భద్రకాళి చెరువు, పక్కనే ఉన్న భద్రకాళి నాలాకు వెళ్తాయి. తిమ్మాపూర్‌, బెస్తం, మద్దెలకుంట, కొండపర్తి, అమ్మవారిపేట దామెర, భట్టుపల్లి, న్యూశాయంపేట కోటి, ఉర్సు రంగసముద్రం చెరువుల నుంచి వరదనీరు ఈ నాలాకు వస్తుంది.

ఎనుమాముల శివారు, కాశీబుగ్గ వరదనీరంతా దేశాయిపేట చిన్నవడ్డేపల్లి నాలాకు వస్తాయి. దేశాయిపేట సీకేఎం కాలేజీ నుంచి డాక్టర్స్‌ కాలనీ మీదుగా ములుగురోడ్‌ కోట చెరువులోకి వరద నీరు వెళ్తుంది. వరంగల్‌ చౌరస్తా, శివనగర్‌, పెరుకవాడ, కరీమాబాద్‌ వైపు నుంచి వరదనీరంతా వరంగల్‌ పోతననగర్‌ నాలాకు వస్తాయి. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాలలో భద్రకాళి నాలా చాలా కీలకం. బొందివాగు, పోతననగర్‌ నాలా నుంచి రంగంపేట భద్రకాళి నాలాకు వరదనీరు చేరుతుంది.

హైదరాబాద్‌ తర్వాత తెలంగాణలో అతి పెద్ద సిటీ వరంగల్. సాధారణంగా పెద్ద నగరాలు నదులు లేదా సముద్రాల పక్కన ఉంటాయి కాబట్టి వాటికి వరదల ముప్పు ఉంటుంది. కానీ వరంగల్ అలా కాదు. వరంగల్‌ను ఆనుకుని పెద్ద నది కానీ, సముద్రం కానీ లేవు. కానీ అలాంటి వరంగల్ కూడా వాన వస్తే మునిగిపోయే దశకు చేరుకుంది. మరి ఈ పరిస్థితికి కారణమేంటి? ప్రతి ఏడాది ముంపు కాలనీలు ఎందుకు పెరిగిపోతున్నాయ్‌? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది.

2011 లెక్కల ప్రకారం శివార్లను కూడా కలుపుకుంటే 13 లక్షల వరకూ జనాభా ఉంటుంది. ఇప్పడు 22 లక్షల వరకూ జనసంఖ్య పెరగవచ్చని అంచనా. పెరుగుతోన్న జనాభాతో పాటూ విస్తరిస్తోన్న నగరం తనలో జనంతో పాటూ చెరువులనూ కలిపేసుకుంది. ఒక్కప్పుడు కాలంలో వరంగల్‌లో ఉండే వందలాది చెరువులు ఇప్పుడు కాలనీలుగా మారాయి. కాకతీయుల కాలం నుంచీ ఇక్కడ పెద్ద చెరువులు ఉన్నాయి. వాటిలో ఒకటి నిండగానే రెండోదానికి నీరు వెళ్లే ఏర్పాటూ ఉంటుంది. ఇలా ఈ నగరం, చుట్టుపక్కలో ఎంతో పటిష్టమైన నీటి పారుదల వ్యవస్థ ఉంది. కానీ ఆ వ్యవస్థ దెబ్బతినడంతో ఇప్పుడు ఓరుగల్లు వాసులకు తిప్పలు తప్పడం లేదు.

వరంగల్ వరదలకు ప్రధాన సమస్య కబ్జాలే. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు మొత్తం నీరు ఉన్నప్పుడు ఉండే హద్దు లోపలికి కూడా వచ్చి ఇళ్లు కట్టేశారు. వరంగల్‌లో గతంలో కబ్జాల వల్ల శివారు కాలనీలు మాత్రమే మునిగేవి. కానీ ఈసారి, ప్రధాన నగరంలోకి కూడా నీళ్లొచ్చాయి. ఇది కాకుండా ఇప్పటికే ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఇంత పెద్ద వర్షానికి సరిపడా నిర్మించింది కాదు. కాకపోతే కాలువలు కబ్జా లేకపోయుంటే అధిక వర్షపాతం వచ్చినా, ఆ కాలువ పరీవాహక ప్రాంతాలు మాత్రమే మునిగి ఉండేవి. కానీ ఆక్రమణలు ఆ అవకాశం లేకుండా చేసేశాయి. ఒక్క భద్రకాళీ చెరువు, దాన్ని ఆనుకుని ఉన్న భూముల్లోనే 20 వరకూ కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు భద్రకాళి చెరువు చుట్టుపక్కల మునిగిన ప్రాంతమంతా ఒకప్పుడు చెరువు భూములే అన్నది వాస్తవం. ఇక చిన్న వడ్డేపల్లి, వడ్డేపల్లి చెరువుల భూముల్లో పెద్ద పెద్ద భవనాలే వెలిశాయి.

ఇప్పుడు వీటన్నింటిని పర్యావసనం.. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకూలడం.. వరదలతో బీభత్స వాతావరణం నెలకొనడం… వరంగల్‌-హనుమకొండ మధ్య రాకపోకలు నిలిచిపోవడం.. కాలనీలన్నీ చెరువులను తలపించడం.. ఇళ్లలోకి మోకాలి లోతుకు మించి నీళ్లు చేరడం.. నిత్యావసరాలు నీటమునిగి తినడానికి తిండికూడా లేని పరిస్థితి రావడం.

వర్షాలు వచ్చినప్పుడు కాస్త హడావుడి చేసి వరద నీరు వెళ్లిపోగానే మళ్లీ షరా మాములే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు రాజకీయ నేతలు, అధికారులు. చివరికి చెరువు భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారు కూడా మళ్లీ ఏం జరగనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఈసారైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందిస్తారా? వచ్చే ఏడాదైనా వరదలు లేని వరంగల్‌ను చూస్తామా? అన్నది ఇక కాలమే నిర్ణయించాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×