Future City: స్వేచ్ఛ బ్యూరో: ‘రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేసి ప్రపంచానికి ఒక అద్భుతమైన నగరాని అందిస్తున్నాం. 2034 నాటికి తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగడానికి ఈ ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అత్యంత కీలకం కాబోతోంది. ఇది కేవలం ఒక నగరం కాదు.. ప్రపంచానికి దిక్సూచి. కాలుష్య రహితమైన, పర్యావరణహితమైన ఒక గొప్ప గ్రీన్ నగరంగా దీనిని తీర్చిదిద్దుతాం. గ్రీన్ ఫార్మా, జీసీసీ, ఐటీ కంపెనీలతో పాటు ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన 500 పెద్ద కంపెనీలను ఫ్యూచర్ సిటీకి రప్పించబోతున్నాం. త్వరలోనే మరో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి ప్రపంచ దేశాల పెట్టుబడులను ఇక్కడికి తీసుకువస్తాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ..
భారత్ ప్యూచర్ సిటీ కార్యాలయంలో ఓపెనింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉన్నదని, 200 ఏళ్ల క్రితమే నాటి పాలకులు హైదరాబాద్‌ను విస్తరించడం వల్లే అది సికింద్రాబాద్‌తో కలిసి జంట నగరాలుగా విలసిల్లిందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో యుద్ధ సామాగ్రిని ఉంచడం వల్ల అది నాడు శత్రు దుర్భేద్యంగా మారిందన్నారు. 1908లో పెను తుఫాన్ వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే, ఆనాటి నిజాం నవాబు మూసీ నది పైన పక్కా నివారణా నిర్మాణాలు చేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు సైబరాబాద్‌ను నిర్మించి ప్రపంచానికి ఒక గొప్ప నగరాన్ని ఇచ్చారన్నారు. ఈ రోజు రాష్ట్రానికి 60 శాతం ఆదాయం ఇక్కడి నుంచే వస్తోందని, అందుకే బంగారానికంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువైందన్నారు.
గత ప్రభుత్వంపై రేవంత్ ఫైర్
గతంలో సైబరాబాద్ నిర్మిస్తుంటే హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, జీనోమ్ వ్యాలీ లాంటివి వద్దే వద్దన్నారని, అనేక కుట్రలు, కుతంత్రాలు చేశారని సీఎం గుర్తు చేశారు. మూసీ నదిలో మురికి కంటే ఎక్కువ విషాన్ని చిమ్మారన్నారు.గతంలో ఆ ప్రాజెక్టులు రాకపోయి ఉంటే.. ఈ రోజు 10 లక్షల మంది యువతకు ఉపాధి లభించేదా? అని సీఎం ప్రశ్నించారు.రామాయణంలో యజ్ఞాన్ని అడ్డుకోవడానికి రావణాసురుడు, శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు ప్రయత్నించినట్లు.. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని బీఆర్ ఎస్ నేతలు చూస్తున్నారన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం..
ఇప్పుడు ‘పెద్ద శుక్రాచార్యుడు’ ఫామ్ హౌస్‌లో కూర్చుని, మారీచుడు, సుబాహుడు లాంటి వాళ్లను బయటకు పంపించాడని సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఉద్దేశంచి మండిపడ్డారు. భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసులు మాట్లాడుతున్నారన్నారు. కళ్లల్లో నిప్పులు పోసుకుని, కడుపులో విషం నింపుకుని అమెరికాకు పోయి కూడా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారని సీఎం వివరించారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే బీఆర్ ఎస్ ను తిరస్కరించారని, వీళ్లకు గతమే తప్ప భవిష్యత్తు లేదన్నారు. ఒకవేళ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని బండకేసి కొడతారని అని సీఎం హెచ్చరించారు.
చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం..
ఇటీవలి వర్షాల వల్ల తలెత్తిన వరద పరిస్థితిపై సీఎం స్పందిస్తూ ఆక్రమణదారులపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.‘తొలకరి వర్షం పడితేనే హైదరాబాద్‌లో రోడ్లు స్తంభించిపోయాయి. కిలోమీటరు దూరానికి రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. 100 కోట్లకు ఎకరం భూమి అమ్మామని జబ్బలు చరుచుకున్న వాళ్లు నిన్నటి వరదలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, కుంటలను చెరపట్టడం వల్లే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు కాలనీలు, బస్తీల్లోకి వచ్చాయి.’ అని సీఎం గుర్తు చేశారు.
లేక్ ఎకానమీ తయారు..
‘ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించుకున్న వారి కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నాం. మేము ఎవరిదైనా ఇంచు భూమైనా తీసుకున్నామా? ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్ధరిస్తున్నాం. అందులో భాగంగానే ‘లేక్ ఎకానమీ’ని తయారు చేస్తున్నాం. మహిళా సంఘాలు అక్కడ వ్యాపారం చేసుకునేలా ప్రణాళికలు వేస్తున్నాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లో చెరువు ఆక్రమణలను తొలగించామన్నారు. కూకట్‌పల్లి నల్లచెరువు, అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను పునరుద్ధరించామన్నారు. గత బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంటను ఆక్రమించి హెలికాప్టర్‌లో పూలు చల్లాడని, గత ప్రభుత్వమే దాన్ని ఆయనకు రాసిచ్చిందన్నారు. ఆ దుర్మార్గుల పని పట్టి కుంటను కాపాడామన్నారు. గండిపేట, హిమాయత్ సాగర్‌లను ఆక్రమించిన పెద్దల నుంచి వాటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ మిన్న..
దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఎంతో సురక్షితం, ప్రగతిశీలం అన్నారు. ముంబైలో వర్షం వస్తే జనం బయటకు రాలేరు, చెన్నైలో వర్షం వస్తే పడవలపై తిరగాలని సీఎం వివరించారు. కోల్‌కతాలో శాంతిభద్రతలు లేవు, బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు ఉన్నాయన్నారు. కానీ హైదరాబాద్‌లో మనం కబ్జాకోరుల పని పడుతున్నాం.. అందుకే ప్రపంచం మొత్తం మన వైపు చూస్తోందని సీఎం చెప్పారు. ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరంగా రాణింపజేస్తామన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
అడ్డుపడితే తొక్కుకుంటూ పోతాం..
దీనికి అడ్డుపడే వాళ్లను అడ్డంగా తొక్కుకుంటూ ఈ ప్రాంత ప్రజలే ముందుకు వెళ్తారన్నారు. ఈ నగరాన్ని ఇక్కడి వాళ్లే కాపాడుకుంటారన్నారు. దీని అభివృద్ధి కోసం తాను వీలైనప్పుడల్లా ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయానికి వస్తానన్నారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: ఎన్నికల కమిషన్ తో కలిసి బీజేపీ డ్రామాలు.. సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్!