DK Aruna: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ హయంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయ్యిందిని, మరి అప్పుడెందుకు ఎవరూ రాజీనామా చేయలేదని పాలమూరు ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆదివారం డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ అవ్వగానే రద్దు చేసి తిరిగి తక్కువ సమయంలో ఎగ్జామ్ పెట్టి కేంద్రం ప్రభుత్వం పొరపాటును సరిదిద్దిందని ఆమె చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసే ఒక వ్యక్తి మోడీ నాయకత్వాన్ని అస్థిరపరచాలని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆమె ఫైరయ్యారు.
రాహుల్ గాంధీపై డీకే అరుణ ఫైర్..
కాంగ్రెస్ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని, ఇక్కడెవరు రాజీనామా చేశారని డీకే అరుణ ప్రశ్నించారు. దేశ కీర్తి, మోడీని అపహాస్యం చేసేందుకు యువతను ఉసిగొల్పారంటూ ఆమె ఫైరయ్యారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఏ ఒక్క విషయంపై పార్లమెంట్ లో చర్చకు వచ్చారా అని నిలదీశారు. కానీ నల్ల దుస్తులు వేసుకుని మాత్రం రోడ్డుపై ధర్నాలు చేస్తారంటూ చురకలంటించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతో అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఆ రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీని నడిపించే డబ్బులకు మాత్రమే వాడుకుంటున్నారని అరుణ విమర్శించారు.
నీ వీపు నువ్వు చూసుకో రాహుల్.. డీకే
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ జరగడం లేదా అని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తన వీపు తాను చూసుకోకుండా సందట్లో సడేమియాలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. భారత్ ను.. నేపాల్, బంగ్లాదేశ్ చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి మద్దతు ఇస్తారా? అంటూ ఆమె విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగస్వాములయ్యారని ఫైరయ్యారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఏ అరాచక శక్తులు ఇందులో ఉన్నాయో అన్నీ బయటికు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను భారతీయులు సహించరని స్పష్టంచేశారు. అశాంతి నెలకొల్పే వారిని వెంటనే గ్రహించి ప్రజలంతా మోడీ వెంటే ఉంటారన్నారు.
Also Read: అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు?.. బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!
కేటీఆర్, రేవంత్ రెడ్డికి మాట్లాడా హక్కు లేదు..
నీట్ రద్దు అవ్వగానే రాహుల్ గాంధీ ధర్నా ఎందుకు చేయలేదని డీకే అరుణ ప్రశ్నించారు. ఎవరో ధర్నా చేస్తే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ కొట్టేయాలని మోడీ ఇంటి ఎదుట ధర్నా చేశారన్నారు. కేటీఆర్, రేవంత్ కు పేపర్ లీక్ పై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె ఫైరయ్యారు. మోడీ నాయకత్వాన్ని చూస్తే మీకెందుకంత బాధ అని మండిపడ్డారు. నిరసనలో విద్యార్థులకంటే ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆవారాలు ఎక్కువగా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ గడ్డి తినే వారిలా మాట్లాడుతున్నారని డీకే అరుణ ఫైరయ్యారు. యాంటీ నేషనలిస్టులు విదేశాల నుంచి ఫుడ్, డబ్బులు పంపించి అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేశారని ఆమె పేర్కొన్నారు. యువత మంచి మార్గంలో నడిచి దేశ సంప్రదాయాలను కాపాడాలని అరుణ విజ్ఞప్తిచేశారు.
5 నిమిషాల్లో రేవంత్ హామీలు కట్టడి చేస్తా..
పక్కింటి వాళ్ళు పండగ చేసుకుంటే రేవంత్ సంబురాలు చేస్తూ ర్యాలీ తీయడమేంటని సెటైర్లువేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై కట్టడి చేయడం తమకు 5 నిమిషాల పని అని డీకే అరుణ ఘాటు కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో ఫార్మా ఉద్యోగుల పేపర్ లీక్ అయిందని, ఇప్పుడు వారు కూడా వచ్చి ఉద్యమంలో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీలపై పర్మనెంట్ సొల్యూషన్ తేవాలని మోడీ చూస్తున్నారని ఆమె తెలిపారు. కఠిన చట్టాల రూపకల్పనకు అందరూ ముందుకి వచ్చి మద్దతు ఇవ్వకుండా.. మోడీ కీర్తిని దెబ్బ తీయాలనే దురాలోచలోనే మాత్రమే ఉన్నారని, అలాంటి వారికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతామని డీకే అరుణ హెచ్చరించారు.
Also Read: ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!