Sridhar Babu: స్వేచ్ఛ బ్యూరో: ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)–2.0లో తెలంగాణకు ప్రాధాన్యత నివ్వాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. దేశంలోనే అగ్రగామి సెమీకండక్టర్ చిప్ డిజైన్ కేంద్రంగా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీలు) ప్రధాన నిలయంగా హైదరాబాద్ ఎదిగిందని ఆయన వెల్లడించారు. మలి దశ సెమీకండక్టర్ తయారీ పెట్టుబడులకు తెలంగాణాను సహజ ఎంపికగా గుర్తించాలని ఆయన అన్నారు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన ‘రైజింగ్ భారత్ సమ్మిట్ – సౌత్ ఎడిషన్’ ఛర్చాగోష్టిలో పాల్గొన్నారు. తెలంగాణ ఒక ఆకర్షణీయమైన పెట్టుడుల కేంద్రంగా అభివృద్ధి చెందిన తీరును వివరించారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సమృద్ధిగా లభించే నిపుణులైన మానవ వనరులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, అత్యుత్తమ వ్యాపార సౌలభ్యం కారణంగానే హైదరాబాద్ జీసీసీలకు ప్రాధాన్య గమ్య స్థానంగా మారిందన్నారు. వేగంగా విస్తరిస్తున్న జీసీసీ వ్యవస్థ, అత్యున్నత సాంకేతిక పరిశ్రమలు, అధునాతన తయారీ రంగాలకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని తెలంగాణ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సెమీకండక్టర్ డిజైన్ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, దేశంలోనే అత్యంత బలమైన చిప్ డిజైన్ ఎకోసిస్టం తెలంగాణలో ఏర్పడిందన్నారు. సెమీకండక్టర్ డిజైన్, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ భద్రత, అధునాతన ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వేలాది మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు పనిచేస్తుండటంతో ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా ఎదగడానికి అవసరమైన బలమైన పునాది రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పడిందన్నారు.
పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్రం చర్యలు..
చిప్ డిజైన్ రంగంలో తెలంగాణ ఇప్పటికే ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమకు దిశానిర్దేశం చేస్తోందని, ఈ బలాన్ని గుర్తించి సెమీకండక్టర్ మిషన్–2.0లో తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇచ్చి చిప్ తయారీ పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. సాంకేతిక రంగంలో ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న రాష్ట్రాలకు సముచిత ప్రోత్సాహం అందిస్తే కేంద్ర ప్రభుత్వ సెమీకండక్టర్ కార్యక్రమం మరింత విజయవంతమవుతుందన్నారు. తెలంగాణాకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ప్రపంచ సెమీకండక్టర్ తయారీ రంగంలో భారత్ అగ్రస్థానానికి చేరాలన్న లక్ష్యం మరింత వేగంగా నెరవేరుతుందని వెల్లడించారు.
జీసీసీ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణ..
పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కారణంగా హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీసీసీ కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్, ఏరోస్పేస్, రక్షణ, ఔషధ పరిశ్రమలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు (బీఎఫ్‌ఎస్‌ఐ), హాస్పిటాలిటీ, బ్యూటీ టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన అనేక బహుళజాతి సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇది తెలంగాణ ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థపై అంతర్జాతీయ సంస్థలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చివరి గ్రామం వరకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ విస్తరించడంతో చిన్న పట్టణాల్లో సైతం డిజిటల్ సదుపాయాలతో పరిశ్రమలు నెలకొల్పే అవకాశం కలిగిందన్నారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే సింగిల్ విండో విధానం తెలంగాణను దేశంలో వ్యాపార నిర్వహణకు అత్యంత అనుకూల రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టిందని చెప్పారు. రానున్న రోజుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను జీసీసీలు, కృత్రిమ మేధ ఆధారిత పరిశ్రమలు, అధునాతన తయారీ యూనిట్లకు కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని మంత్రి తెలిపారు. ఇందుకోసం కొత్త ప్రోత్సాహకాలు, అత్యుత్తమ మౌలిక వసతులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్య మానవ వనరులను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్రానికి విజ్ఞప్తి..
సెమీకండక్టర్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, ఆవిష్కరణల రంగాల్లో తెలంగాణ ఇప్పటికే సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని ఇండియా సెమీకండక్టర్ మిషన్–2.0లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రతిభావంతమైన మానవ వనరులు, వినూత్న ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం, స్థిరమైన పారిశ్రామిక విధానాల కారణంగానే హైదరాబాద్ దేశంలో జీసీసీలకు అత్యంత ప్రాధాన్య గమ్య స్థానంగా ఎదిగిందని, ఇప్పుడు సెమీకండక్టర్ తయారీ రంగంలోనూ తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. అది తెలంగాణ అభివృద్ధికి మాత్రమే కాదు, ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో భారత్ లక్ష్యాలను మరింత బలోపేతం చేయడానికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.
Also Read: అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు?.. బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!