CM Revanth Reddy: తెలంగాణ ఆవిర్భావం రోజున తన సభను ఎందుకు అడ్డుకున్నారన్న ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బదులిచ్చారు. దిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ.. శాంతిభద్రత కారణాలతోనే ఆ రోజున పవన్ సభకు హైదరాబాద్ లో అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పవన్ కు తెలంగాణలో స్వేచ్ఛ ఉందన్న రేవంత్.. రాష్ట్రంలో పోటీ కూడా చేయవచ్చని స్పష్టం చేశారు. ఎప్పుడైనా రావొచ్చు, వెళ్లొచ్చని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇప్పటికే పలు పార్టీలు వచ్చి పోటీ చేసిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ క్రమంలోనే జనసేన బరిలో నిలవడాన్ని తప్పుబట్టలేమని పేర్కొన్నారు. అయితే సభలతో లాండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తామంటే మాత్రం.. ఒప్పుకునేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ఇటీవల ప్రెస్ మీట్ లో పవన్ వ్యాఖ్యల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి మంత్రి పొన్నం ఆన్సర్ ఇచ్చారంటూ రేవంత్ బదులిచ్చారు. ఏపీలో జగన్ సభలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో పవన్ సమాధానం చెప్పాలంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు.
మరోవైపు తెలంగాణ పెద్ద ఎత్తున జరుగుతున్న హిట్లర్ వివాదంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైడ్రా అనేది హిట్లర్ కాలంలో ఉండేదని మాత్రమే తాను చెప్పినట్లు స్పష్టతనిచ్చారు. హిట్లర్ తన రోల్ మోడల్ అని ఎక్కడా తాను చెప్పలేదని పేర్కొన్నారు. మరోవైపు త్వరలో క్యాబినేట్ విస్తరణ జరగబోతోందన్న ప్రచారాన్ని సైతం సీఎం కొట్టిపారేశారు. అవి కూడా కేవలం ఉహాగానాలు మాత్రమేనని అన్నారు. తమ పార్టీలోని 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులేనని చెప్పారు. కానీ రాజ్యాంగం ప్రకారం 17 మందికే మంత్రి వర్గంలో ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.
Also Read: కాంగ్రెస్‌లో అంతర్గత పోరు.. షబ్బీర్ అలీపై మహిళా నేత ఫైర్.. పోలీసులకు ఫిర్యాదు!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురించి స్పందిస్తూ.. బీజేపీపై రేవంత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి అయితే ఓట్ చోరీ లేదంటే సీట్ చోరీ మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. మీనాక్షి నటరాజన్ పై అసలు తెలంగాణలో కేసే లేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్భిద్ది ఏంటో బయటపడిందని రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు మోదీని కౌగిలించుకున్న ఫొటోపై స్పందిస్తూ.. ఆయనే ముందుగా తనను ఆలింగనం చేసుకున్నారని రేవంత్ అన్నారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులకు కేంద్ర నిధులు రాకపోవడానికి కిషన్ రెడ్డే కారణమని రేవంత్ ఆరోపించారు.
Also Read: అద్దె ఇంట్లో ఉండేవారికి గుడ్ న్యూస్.. ఏసీ పెట్టేందుకు నిరాకరిస్తే.. ఓనర్లకు రూ.94,904 జరిమానా!