Vemula Prashanth Reddy: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సరైన నిర్వహణ లేక, లబ్ధిదారులకు అందక శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం
గతంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడమే ఆలస్యానికి కారణమని, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిరుపేదలకు ఇళ్లను కేటాయించకపోవడం దారుణమని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇళ్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా వెంటనే అర్హులైన పేదలకు వాటిని అప్పగించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఇళ్లపై గణాంకాలతో దాడి
హైదరాబాద్‌లో కోటి ఆశలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. లక్ష ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. అదే సమయంలో తమ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ పరిధిలో ఏకంగా లక్ష ఇళ్లు నిర్మించామని గుర్తుచేశారు. అందులో ఇప్పటికే 62 వేల ఇళ్లను పేదలకు విజయవంతంగా పంపిణీ చేశామని, మిగిలిన 38 వేల ఇళ్లను కూడా ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు
కొత్త ఇళ్ల నిర్మాణం పేరుతో లబ్ధిదారుల నుంచి రూ. 6 లక్షలు వసూలు చేయాలని చూడటం సరికాదని, ఇది నిరుపేదలపై అదనపు భారం మోపడమేనని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీరును తప్పుబడుతూ, పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని మాజీ మంత్రి కోరారు.
Also Read: రంగనాథ్ వ్యవహారంలో సస్పెన్స్.. సీఎం రేవంత్ రీఎంట్రీతోనే క్లారిటీ!