BigTV English

KCR: కేసీఆర్‌కి రేవంత్ ఫికర్!.. రాజకీయమంతా ఆయన చుట్టూనే!!

KCR: కేసీఆర్‌కి రేవంత్ ఫికర్!.. రాజకీయమంతా ఆయన చుట్టూనే!!
KCR news today telugu

KCR news today telugu(Political news in telangana): ఇన్నాళ్లూ రేవంత్‌రెడ్డి తాను అనాల్సినవేవో అనేసేవారు. సీఎం కేసీఆర్ అసలేమాత్రం పట్టించుకోనట్టు ఉండేవారు. ఈయన ప్రెస్‌మీట్లు పెట్టి తిట్టు. ఆయన తనను కాదన్నట్టు సైలెంట్‌గా ఉండుడు. ఇన్నేళ్లు ఇలానే నడిచింది రాజకీయం. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఎన్నికలు దగ్గరకొచ్చాయ్. కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. కాంగ్రెస్‌లో జోరు పెరిగింది. రేవంత్ దూకుడు మామూలుగా లేదు. ఇలాగైతే కుదరదని.. కేసీఆర్ రూటు మార్చారు. విమర్శలకు బదులిస్తున్నారు. రేవంత్ చేసే ప్రతీ ఆరోపణకు.. వివరణ ఇచ్చుకుంటున్నారు.


లేటెస్ట్‌గా యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్ అనిల్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ప్రగతిభవన్‌లో ఆయనకు కండువా కప్పారు కేసీఆర్. ఏదో జిల్లా రాజకీయాలో, పార్టీ విషయాలో మాట్లాడాల్సింది పోయి.. కేసీఆర్ ప్రసంగమంతా రేవంత్ ఆరోపణల చుట్టూనే తిరిగింది. ఉచిత విద్యుత్, ధరణిపైనే సీఎం ఎక్కువ సేపు మాట్లాడాల్సి వచ్చింది. అట్లుంటది రేవంత్ ఎఫెక్ట్.

ఇటీవల అమెరికాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా ఎడిట్ చేసుకొని.. రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని అన్నారంటూ నానారచ్చ చేసింది బీఆర్ఎస్. తాజాగా సీఎం కేసీఆర్ సైతం ఉచిత విద్యుత్‌పై పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు. మూడుగంటల విద్యుత్ సరిపోతుందని కొందరు అంటున్నారంటూ రేవంత్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ఉచిత విద్యుత్ ఇచ్చిన విధానాన్ని.. కరెంట్ డిపార్ట్‌మెంట్ పనితీరును.. ఆ శాఖలో ఐఏఎస్‌లను నియమించకపోవడం.. ఇలా అనేక విషయాలు ఏకరువు పెట్టారు. ఇదంతా.. తాను ఎంతో కష్టపడుతున్నాననే చెప్పడానికే అంటున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదంటూ.. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీయడంతో.. ఉలిక్కిపడిన కేసీఆర్.. ఇలా వివరణ ఇచ్చుకున్నారని చెబుతున్నారు. అంత మాట్లాడిన సీఎం.. తన ప్రసంగంలో ఎక్కడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు చెప్పకపోవడం ఆసక్తికరం.


ఇక, ధరణిపైన ధూంధాం నడుస్తోంది. ధరణిపై ధారావాహికలు వదులుతున్నారు పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి. ధరణి పోర్టల్ వెనుకు ఉన్నదెవరు? ఆ కంపెనీ ఎవరిది? డేటా మొత్తం విదేశాల్లో ఉండటం.. అది తిరిగి కేటీఆర్ సన్నిహితుల చేతికే రావడం.. రాత్రికిరాత్రి రిజిస్ట్రేషన్లు జరిగిపోవడం.. ఉదయం కల్లా లాక్ వేయడం.. ఇలా వరుస ప్రెస్‌మీట్లతో ధరణి గుట్టు అంతా రట్టు చేస్తున్నారు రేవంత్‌రెడ్డి.

ప్రజల్లో ధరణి అవసరమా అనే చర్చ మొదలవడంతో.. అప్పటినుంచీ సీఎం కేసీఆర్ తన ప్రతీ ప్రోగ్రామ్‌లో ధరణి గురించే మాట్లాడుతున్నారు. జిల్లాల్లో కలెక్టరేట్లు ప్రారంభోత్సవాలైనా.. పార్టీ సభలైనా.. పార్టీలో చేరికలైనా.. ఇలా ఈవెంట్ ఏదైనా.. టాపిక్ మాత్రం ధరణి గురించే ఉంటోంది. చెప్పిందే చెబుతున్నారు. ధరణి వల్లే భూముల ధరలు పెరిగాయని.. ధరణి వల్లే రైతు బంధు వస్తోందని.. ధరణి ఓ అల్లావుద్దీన్ అద్భుతదీపమని.. ఊరదగొడుతున్నారు. అయితే, ఆ ధరణిలోనూ కొన్ని సమస్యలు ఉంటే ఉండొచ్చని.. కేసీఆర్ ఒప్పుకుంటుండటం మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.

ఇలా కొన్నాళ్లుగా గులాబీ బాస్‌కు రేవంత్‌రెడ్డి ఫికర్ పట్టుకుందని అంటున్నారు. కలలోనూ ఆయనే గుర్తొస్తున్నారేమో.. అందుకే ఎక్కడికెళ్లినా.. ఏ కార్యక్రమమైనా.. ధరణి, ఉచిత కరెంట్ గురించే సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తూ.. తమ తప్పేమీ లేదని.. అంతా ఒప్పే చేస్తున్నామని.. నమ్మండి మొర్రో అని వేడుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×