CM Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: రెండేళ్ల పాలనపై కాంగ్రెస్ సర్కార్ స్కోర్ కార్డు తయారు చేసినట్లు తెలిసింది. అంశాలు, శాఖలు, జిల్లాల పరిస్థితులు ఆధారంగా వీటిని రూపొందించినట్లు సమాచారం. ఇటీవల ఈ మూడు అంశాల ఆధారంగా ప్రభుత్వం ఓ సర్వే నిర్వహించింది. వీటి ఆధారంగానే స్కోర్ కార్డు తయారు చేశారు. రాబోయే కాలంలో ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాలు అమల్లో ఈ స్కోర్ కార్డు ఆధారంగా డెసిషన్స్ తీసుకోనున్నారు. తాజాగా ఈ సర్వే రిపోర్టు సీఎంకు చేరినట్లు తెలిసింది. పరిపాలన స్పీడ్ కు రాబోయే రోజుల్లో మరిన్ని నిర్ణయాలను తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేగాక స్కోర్ కార్డులో తక్కువ మార్కులు వచ్చిన జిల్లాలు, శాఖలపై కూడా సీఎం స్క్రీనింగ్ చేయనున్నారు. ఆయా జిల్లాల్లోని నేతలు, ఆ శాఖల ఆఫీసర్లతో సీఎం ప్రత్యేకంగా రివ్యూలు నిర్వహించనున్నారు. అంతేగాక ఆ జిల్లాల పర్యటనలకూ సీఎం రూట్ మ్యాప్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంలో పాలనా యంత్రాంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తున్నారు. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, జిల్లాల వారీగా, శాఖల వారీగా ‘పనితీరు స్కోర్ కార్డ్’ సిద్ధం చేయడం ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తే జిల్లాలు ఆధారంగా స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మౌలిక వసతులు, ఐటీ పెట్టుబడులు, రెవెన్యూ వసూళ్లలో దూసుకుపోతున్నాయి. మున్సిపల్ సేవల డిజిటలైజేషన్ , రెవెన్యూ ఫైల్స్ క్లియరెన్స్ ల ఇక్కడ సత్ఫలితాలను ఇస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వ్యవసాయం, విద్య, మౌలిక వసతుల్లో పురోగతి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తున్నట్లు సర్వేలో గుర్తించారు. ఇక ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ లోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కొరత, భూ వివాదాల పరిష్కారంలో జాప్యం, పారిశ్రామిక ప్రాజెక్టుల నెమ్మది ఉన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో డెవలప్ మెంట్ మందగించి ప్రజలకు మైనస్‌గా మారాయి. మంత్రులు, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు సమన్వయంతో పనిచేస్తేనే అన్ని జిల్లాలు డెవలప్ లో సమానత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతాయని సర్వేలో తేల్చారు.
వ్యవసాయం లో రైతు పథకాల కొనసాగింపు, పంటల మార్పిడిలో స్పష్టత లేమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక పరిశ్రమలు ,ఐటీ ల్లో భారీ స్థాయిలో ఒప్పందాలు జరుగుతున్నాయి. పెట్టుబడుల ఆకర్షణ జరుగుతున్నప్పటీ, కేవలం హైదరాబాద్ చుట్లే పరిశ్రమలు, ఐటీ గ్రోత్ కనిపిస్తుంది. జిల్లాలకు విస్తరించేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో త్వరలోనే జిల్లాల్లోనూ హైదరాబాద్ తరహాలో మౌలిక సదుపాయాలు, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను రూపొందించేందుకు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.ఇక చాలా జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం లేదు. ఇక వైద్యం జిల్లా ఆసుపత్రుల ఆధునీకరణ, గ్రామీణ సిబ్బంది కొరత, పర్యవేక్షణ లేమి ప్రభుత్వానికి సవాల్ గా మారుతుంది. జిల్లా స్థాయి ఆసుపత్రులను డెవలప్ చేయాలని ముందుకుసాగుతున్నప్పటీ, డాక్టర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు తేలింది. మరోవైపు రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ఫైళ్ల కదలికలో జాప్యం జరుగుతూనే ఉన్నది. భూ భారతి వచ్చినప్పటికీ ఇంకా భూవివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తయినప్పటికీ, భూ అంశాల్లో ప్రజలకు స్పష్టమైన నమ్మకాన్ని కల్గించలేకపోయామని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ అందింది.
Also Read: Teacher Unions: విద్యా కమిషన్ సిఫార్సులపై టీచర్లు కన్నెర్ర.. పరిధి దాటారంటూ తీవ్ర ఆగ్రహం..!
గత ప్రభుత్వంలో నిర్ణయాలన్నీ ఒకే కేంద్రం నుంచి వెలువడేవి. అంటే సీఎంవో నుంచే కీలక మైన నిర్ణయాలు, విధానాలు, అందుకు మార్గదర్శకాలు వెలువడేవి. కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ వికేంద్రీకరణ కు ప్రాధాన్యత ఇస్తోంది.ఈ నేపథ్యంలో నిర్ణయాధికారం కింది స్థాయికి వెళ్తున్నది. కానీపర్యవేక్షణ లోపిస్తే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ రెండేళ్లలో ఇలాంటి వివాదాలు, విమర్శలను ప్రభుత్వం చాలా ఎదొర్కోవాల్సి వచ్చింది. దీంతో సెక్రటేరియట్ నుంచి ఫీల్డ్ లెవల్ వరకు పాలన పారదర్శకంగా, స్పీడ్ గా జరగాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక సంస్కరణలకు సిద్ధమవుతున్నారు. అన్ని జిల్లాల్లో సంక్షేమ పథకాలు గ్రౌండ్ రిపోర్టు ఆధారంగా కలెక్టర్ల పనితీరును కూడా రిపోర్టు తయారు చేయనున్నారు.
అంతేగాక ప్రతి శాఖ పనితీరును ప్రజలే చూసేలా పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ డ్యాష్ బోర్డు సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నారు. ట్రాన్స్ ఫర్స్ పాలసీలోనూ మార్పులు తీసుకురానున్నారు. రాబోయే మూడేళ్లలో పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ చేయడం,గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, విద్యారంగాలను గాడిలో పెట్టడం, విజన్ 2047 డాక్యుమెంట్ కు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ ను ముందుకు తీసుకువెళ్లాలి. అయితే శాఖల వారీగా పనితీరు రిపోర్ట్, జిల్లా కలెక్టర్లకు టైమ్‌బౌండ్ లక్ష్యాలు, బదిలీలకు పారదర్శక విధానం, వ్యవసాయంలో మార్కెట్ లింకేజ్ బలోపేతం, పరిశ్రమల్లో గ్రౌండ్ ప్రాజెక్ట్ మానిటరింగ్, విద్యలో లెర్నింగ్ అవుట్‌కమ్ అంచనా, వైద్యంలో గ్రామీణ సిబ్బంది భర్తీ, మెడికల్ కాలేజ్,లు నిర్వహణ, రెవెన్యూలో భూ వివాదాల వేగవంత పరిష్కారం, శాఖల మధ్య డేటా సమన్వయం, ప్రతి ఆరు నెలలకు పరిపాలనా పనితీరు వైట్ పేపర్ విడుదల వంటి సంస్కరణలు, విధానాలను సమర్ధవంతంగా నిర్వహిస్తే ప్రభుత్వానికి పాజిటివ్ మార్కులు వస్తాయని స్కోర్ కార్డుతో పేర్కొన్నారు.
Also Read: Salaries Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది పెరగనున్న జీతాలు.. లేటెస్ట్ సర్వే