Revanth Reddy Letter : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఈ యాత్ర భాగ్యనగారానికి చేరుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారత్ జోడో యాత్రకు మద్దతు తెలపాలని కోరారు. ప్రజలు యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ రేపటి భవిష్యత్ కోసం రాహుల్ కు మద్దతుగా నిలవాలని కోరారు. పాదయాత్రలో కనీసం ఒక్క కిలోమీటరైనా కలిసి నడిసి దేశ ఐక్యతను చాటాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన అస్థిత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి కారణం హైదరాబాద్ అని రేవంత్ పేర్కొన్నారు. అలాంటి భాగ్యనగారాన్ని మనకు వరంగా ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. రాహుల్ గాంధీ అడుగులో అడుగు కలుపుదాం.. రాజకీయాలకు అతీతంగా జత కడదామన్నారు. దేశం కోసం ఒక్క రోజు.. ఒక్క గంట గడప దాటి రండి.. అని పిలుపునిచ్చారు. నవంబర్ 1న మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్ వద్ద కలుసుకుందామంటూ లేఖలో రేవంత్ రెడ్డి తెలిపారు.
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశం కోసం భారత్ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తూ ఆసేతు హిమాచలాన్ని ఏకం చేస్తూ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో రాహుల్ వేసిన తొలి అడుగు.. రాష్ట్రాలు దాటుతూ అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశించింది.