Virat Kohli: విరాట్ కోహ్లీ. మోస్ట్ పాపులర్ క్రికెటర్. కోహ్లీ గురించి ఏ చిన్న అప్ డేట్ కోసమైనా.. ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతుంటారు. విరాట్ గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తుంటారు. అాలంటిది ఏకంగా కోహ్లీ ఉంటున్న రూమ్ వీడియోనే లీక్ అయితే? ఇంకేం ఫ్యాన్స్ కు పండగే. విరాట్ రూమ్ లో ఏమేం వస్తువులు ఉన్నాయి? ఆయన ఏయే గాడ్జెట్స్ వాడుతుంటారు? ఇలా ఎక్కడలేనంత ఉత్సాహంగా ఆ వీడియోను చూస్తూ వైరల్ చేస్తున్నారు అభిమానులు.
ఫ్యాన్స్ వరకూ ఓకే. కోహ్లీకి మాత్రం పిచ్చి కోపం వచ్చింది. అదేంటి? తన హోటల్ గది వీడియో ఇలా బయటకు రావడం ఏంటి? ఇలాగైతే తనకు ఇంకేం ప్రైవసీ ఉంటుంది? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న టీమిండియా.. పెర్త్ లో కోహ్లీ ఉంటున్న హోటల్ రూమ్ కు సంబంధించిన వీడియో లీక్ అవడం కలకలం రేపుతోంది.
కోహ్లీ లేని సమయంలో అతడు ఉండే గదిలోకి వెళ్లారొకరు. బహుషా హోటల్ సిబ్బంది అయి ఉంటారు. తన సెల్ ఫోన్ లో విరాట్ రూమ్ మొత్తం వీడియో తీశాడు. నీట్ గా బట్టలు సర్ది ఉన్న సూట్ కేస్.. పలు జతల చెప్పులు, షూష్.. వార్డ్ రోబ్.. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కొన్ని బాక్సెస్.. ఇలా కోహ్లీ వాడే వస్తువులన్నీ ఆ వీడియోలో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అదికాస్తా వైరల్ అవడంతో.. విరాట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన పర్సనల్స్ అన్నిటినీ అలా వీడియో తీయడంపై మండిపడ్డారు. ఇది చాలా భయానకమని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనంటూ ఇన్‌స్టా వేదికగా ఆగ్రహం ప్రదర్శించాడు.
‘అభిమానులు తమకు ఇష్టమైన ఆటగాళ్లను చూసినప్పుడు ఎంతో ఆనందపడతారని, వాళ్లను కలిసేందుకు ఉత్సాహంగా ఉంటారని నేను అర్థం చేసుకోగలను. అలాంటి అభిమానాన్ని నేను అభినందిస్తాను కూడా. కానీ, ఈ వీడియో భయానకం. నా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఈ వీడియో చూసి షాక్ అయ్యాను. నా హోటల్ గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే.. ఇంకెక్కడ నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఇలాంటి మూర్ఖమైన అభిమానాన్ని నేనెప్పుడూ అంగీకరించలేను. ఇది కచ్చితంగా గోప్యతా ఉల్లంఘనే. దయచేసి ప్రతి ఒక్కరి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. ఎవరినీ వినోద వస్తువుగా చూడొద్దు’ అంటూ భావోద్రేక పోస్ట్ పెట్టాడు విరాట్ కోహ్లీ.
ఆ వీడియోపై విరాట్ భార్య అనుష్క శర్మ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అభిమానుల విపరీత చర్యల వల్ల గతంలోనూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాం. కానీ ఇది చాలా దారుణం. ఓ వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగించే అవమానకర చర్య. దీనికి హద్దు అనేది లేదా? కొన్ని ఉద్వేగాలను నియంత్రించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం’ అంటూ అనుష్క సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు.