Revanth reddy: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు నిందితుల నుంచి పోలీసులు సేకరించిన ఆధారాలు.. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ దగ్గరకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పోలీసులు ఆ వీడియో సాక్షాలను కోర్టులో ప్రవేశ పెట్టాలి కానీ.. కేసీఆర్ కు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. రేవంత్ రెడ్డి అడిగిన దాంట్లో లాజిక్కు ఉందంటున్నారు న్యాయ నిపుణులు.
మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై మీడియాతో ముచ్చటించారు రేవంత్ రెడ్డి. డబ్బు, మద్యంతో అధికార పార్టీ గెలిచిందని ఆరోపించారు. ఓటమి భయంతో సీపీఐ మద్దతు తీసుకుని గట్టెక్కారని అన్నారు. పొత్తు లేకుండా సొంతంగా ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేని కేసీఆర్ దేశాన్ని ఏం ఉద్దరిస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అన్ని అక్రమాలకు పాల్పడినా కూడా.. కేవలం 10వేల ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం నిజాయితీగా 24వేల ఓట్లు పొందడం గర్వంగా ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంశం ప్రస్తుతం ఏఐసీసీ పరిధిలో ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
రాజ్ భవన్, ప్రగతి భవన్ ఆధిపత్య పోరుపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. పాలన విషయంలో గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. గవర్నర్ కూడా పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ఉండాలిని చెప్పారు.
ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సమాజం కోసం రాహుల్ చేసిన పాదయాత్ర.. అన్ని వర్గాల ప్రజలకు భరోసానిచ్చేలా సాగిందన్నారు రేవంత్ రెడ్డి.