Ippatam : జగన్ సీఎం అయ్యాక ఏపీ అధికార వాహనంగా జేసీబీ మారిందంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. రోడ్డు విస్తరణలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం రైతులు భూములు ఇచ్చారన్న కక్షతోనే ఇళ్లు కూల్చారని అన్నారు నారా లోకేశ్.
గుంతలు పూడ్చలేనివారు 120 అడుగుల రోడ్డు వేస్తామంటే నమ్మాలా? అని లోకేశ్ ప్రశ్నించారు. గ్రామంలోకి వచ్చే దారి 30 అడుగుల వెడల్పు ఉంటే.. గ్రామంలోపల దారి 120 అడుగులు ఎందుకని నిలదీశారు. దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు లేని ఇప్పటంలో అలజడి రేపారని.. పేదల కన్నీరు చూడటమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.