
Revanth reddy today news(Telangana politics) :
2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు మరో 3 నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే అనేక హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటి నుంచో గళమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖాస్త్రం సంధించారు.
కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంలోనూ కాంట్రాక్టు ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామని అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. 2014 మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని కేసీఆర్ పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పటైనా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను మాత్రం ప్రభుత్వం రెగ్యులర్ చేయలేదని రేవంత్ మండిపడ్డారు. జీతాలకోసం వేడుకోవాల్సి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం వారికి కష్టంగా మారిందన్నారు. ఈఎంఐలు సకాలంలో కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో బాధాకరమని రేవంత్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతం ఎప్పుడు పడుతుందో కూడా తెలియని దుస్థితి వచ్చిందని విమర్శించారు. ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమని చెప్పుకోవడమే తప్ప వేతనాలు చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వం వచ్చిందన్నారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వకపోతే పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతుందని రేవంత్ హెచ్చరించారు.