
Latest BJP news in telangana(Political news today telangana) :
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే టిక్కెట్ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సీటు కోసం యువనేత విక్రమ్‌గౌడ్ దరఖాస్తు చేయడం ఆసక్తిని రేపుతోంది. ఆయన తన దరఖాస్తును పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి అందించారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ కాకుండా విక్రమ్‌గౌడ్ దరఖాస్తు చేసుకోవడంతో చర్చనీయాంసంగా మారింది.
ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు తీసుకుంటోంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్య నేతలు ఎవరూ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ క్రమంలో రాజాసింగ్ కంచుకోట గోషామహల్ టికెట్‌ను విక్రమ్‌గౌడ్ కోరడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తదారని రాజాసింగ్ ఎదురుచూస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ ను గోషామహల్ నుంచి పోటీ చేయించే విషయంలో బీజేపీ అధిష్టానం పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌కు గోషామహల్ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం విక్రమ్‌గౌడ్ దరఖాస్తుతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
గోషామహల్ నుంచి 2014, 2018 ఎన్నికల్లో రాజాసింగ్ బీజేపీ తరఫున విజయం సాధించారు. ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడపైనే గెలిచారు. అంతకు ముందు ముఖేష్ గౌడ్ 1989, 2004లో కాంగ్రెస్ తరఫున మహరాజ్ గంజ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో గోషామహల్ నుంచి గెలిచి రెండోసారి మంత్రి అయ్యారు. ఇప్పుడు అదే స్థానంలో ఆయన కుమారుడు బీజేపీ నుంచి బరిలోకి దిగుతారన్న వార్తలు ఆసక్తిగా మారాయి. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజాసింగ్‌ను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.